Wife Killed Husband: తొమ్మిది సంవత్సరాలు కాపురం చేసి కట్టుకున్న భర్తని హత్య చేసి మృతదేహాన్ని కారులో ఆసుపత్రికి తరలించి.. తన భర్త ఆరోగ్య పరిస్థితి చూడమంటూ నటించింది. పరీక్షించిన వైద్యులు మృతి చెందాడని చెప్పగా మహానటి లెవల్లో ఏడుస్తు నటించింది. అయితే పోలీసులు ఎంట్రీతో ఆ మహిళ నడిపిన కథ వెలుగులోకి రావడంతో అసలు విషయం బయటపడింది. ఈ ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగింది.
పాడేరు సీఐ సుధాకర్, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగుల మండలం నేరేడువలసకు చెందిన హరి విజయ్, ముంచంగిపుట్ట మండలం దారెల పంచాయితీ చివుకుచింత చెందిన ప్రీతిని 2014లో ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వారికి ఒక పాప పుట్టింది. ఈ ముగ్గురితో పాటు ప్రీతి తండ్రి శంకర్రావు కలిసి అనకాపల్లి జిల్లాలోని చోడవరం లోని మారుతీనగర్‌లో నివాసం ఉంటున్నారు. హరి విజయ్ ఫైనాన్స్ వ్యాపారం చేసేవాడు. ఫైనాన్స్ వ్యాపారం విషయంలో భార్యభర్తలిద్దరి మధ్య తరచు చిన్న చిన్న గొడవలు జరిగేవి.
ఈ నేపథ్యంలో ప్రీతి, ఆమె తండ్రి శంకర్రావు కలిసి భర్తను అంతమొందించాలని కుట్ర పన్నారు. ఈ క్రమంలోనే ఈ నెల 17వ తేదీన స్నేహితులతో కలిసి విజయ్‌కు మద్యం తాగించారు. అనుకున్న ప్రకారం మద్యం మత్తులో ఉన్న విజయ్ ముఖంపై దిండుతో అదిమి హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని కారు డిక్కీలో వేసి 55 కిలో మీటర్లు దూరంలో ఉన్న అల్లూరి జిల్లా పాడేరు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అరకు వెళ్తుంటే గుండెపోటుతో కోమాలోకి వెళ్లాడని వైద్యులను నమ్మించింది. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు స్పష్టం చేశారు.
అన్న మృతిపై అనుమానాలు ఉన్న విజయ్ సోదరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఈ కేసును హత్యగా నిర్ధారించారు. దీనిపై పాడేరు ఎస్సై లక్ష్మణ్ రావు దర్యాప్తు చేసి కాల్ డేటా, పోస్టుమార్టం నివేదిక ఆధారంగా ప్రీతి సహా ఏడుగురు నిందితులను గుర్తించారు. ప్రీతి తండ్రి శంకర్రావును అరెస్ట్ చేశారు.ఈ కేసును జిల్లాగ ఎస్పీ ఉత్తర్వుల మేరకు అనకాపల్లి జిల్లా చోడవరం స్టేషన్‌కు బదిలీ చేశారు.
"వీళ్లకి ఫైనాన్స్ విషయంలో గొడవలు రావడంతో ఎలాగైనా భర్తను చంపి.. అతని ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని ప్రీతి ఈ నెల 17న రాత్రి ఆమె తండ్రి శంకర్రావుతో కలిసి హతమార్చింది. విజయ్‌కి శంకర్రావు బాగా మందు తాగించి అతను మత్తులో ఉన్నప్పుడు మరో ఐదుగురితో కలిసి దిండుతో ముక్కు, నోరు అదిమి చంపారు. తెల్లారి ఉదయం ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు చెప్పారు. మృతుని సోదరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశాం"- సుధాకర్, పాడేరు సీఐ
ఇవీ చదవండి: