Tragedy of a Missing Teacher Incident: ఆయన ఒక ఉపాధ్యాయుడు... ఒక్కసారిగా కనిపించకుండా పోయాడు. అతని జాడ కోసం కుటుంబ సభ్యులు వెతకని చోటు లేదు... చేయని ప్రయత్నం లేదు.. అవకాశం ఉన్న ప్రతి చోట వెతికారు. పోలీసులు అనేక ప్రయత్నాలు చేసినా ఎక్కడా ఆచూకీ లభించలేదు. అతని కోసం ప్రకటనలు ఇచ్చారు. అనేకచోట్ల పోస్టర్లు అంటించారు. వివిధ రాష్ట్రాలు వెతికారు... ఎంత వెతికినా ప్రయోజనం లేకపోయింది.
కానీ ఎక్కడ ఉన్నా సరే ప్రాణాలతో ఉంటే చాలని ఆ కుటుంబ సభ్యులు అనుకున్నారు. కానీ ఇంతలోనే ఊహించని ఘటన ఒకటి జరిగింది. ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఆ ఉపాధ్యాయుడు కనిపించకుండా పోయిన నాలుగు నెలల తరువాత.. పోలీసులు కబురు పంపారు. అక్కడకి వెళ్లి చూసిన ఆ కుటుంబ సభ్యుల బాధ వర్ణణాతీతంగా ఉంది. అతని మృతదేహం కనీసం గుర్తుపెట్టలేని స్థితిలో.. అస్తిపంజరంలా మారింది. దీంతో ఆ కుటుంబం కన్నీరు మున్నీరై విలపిస్తున్నారు.
అసలు ఏం జరిగిందంటే: ఓ ఉపాధ్యాయుడు నాలుగు నెలల కిందట అకస్మాత్తుగా కనిపించకుండా పోయాడు. ఎక్కడకి వెళ్లారో కూడా తెలియదు. బంధువులు ఎన్నోచోట్ల వెతికి వెతికి అలసిపోయారు. చివరికి అస్తిపంజరంలా విగతజీవిగా కనబడటంతో వారి కుటుంబంలో విషాదం నెలకొంది. అల్లూరి జిల్లా పాడేరు కుమ్మరి పుట్టు వీధిలో నివాసం ఉంటున్న పాంగి వెంకట రమణ అనే వ్యక్తి 25 ఏళ్లుగా ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. గత ఏడాది నవంబర్‌లో అదృశ్య మయ్యారు. పోలీసులకు కుటుంబీకులు ఫిర్యాదు చేశారు. అప్పటినుంచి వెతుకులాట ప్రారంభించారు. కనపడటం లేదని పోస్టర్స్ అంటించారు. జిల్లాలో అన్ని బస్సులకు పోస్టర్లు వేశారు.
చివరికి పొదల్లో విగతజీవిగా: చివరికి నాలుగు నెలల తర్వాత పాడేరు బాలికల గురుకుల ఆశ్రమ పాఠశాల ప్రహరీ వెనుక.. పొదల్లో చేపలు పట్టే వారికి విగత జీవిగా కనిపించాడు. అప్పటికే మృతదేహం అస్తిపంజరంలా మారిపోయింది. పోలీసులకు సమాచారం అందించారు. అదృశ్యమైన ఉపాధ్యాయుడు అయి ఉండవచ్చునని కుటుంబీకులకు సమాచారం అందించారు. బంధువులు వచ్చి అతని వేసుకున్న లోదుస్తులు బట్టి ఉపాధ్యాయుడు వెంకటరమణ మృతదేహంగా గుర్తించారు.
ఎలా మరణించి ఉండవచ్చంటే: గడ్డ పక్కన బాత్రూంకి వెళ్లి పడిపోయి మృతి చెంది ఉండవచ్చునని భావిస్తున్నారు. ఎక్కడో ఏ రూపంలో బ్రతికి ఉన్నాడని అనుకుని.. చివరికి ఇలా నిర్జీవంగా పడి ఉండటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికే లక్షలాది రూపాయలు అతన్ని వెతకడం కోసం ఖర్చు చేశారు. ఆంధ్ర, తెలంగాణ, పశ్చిమ బెంగాల్ కూడా వెతికారు. పలువురు మోసపూరితంగా ఫోన్ చేసి.. మీ నాన్న మా దగ్గర పని చేస్తున్నారని.. డబ్బులు వేస్తే పంపిస్తామని చెప్తే.. పలుమార్లు అలా కూడా వేశామని కుటుంబ సభ్యులు చెప్తున్నారు.
ఇవీ చదవండి: