pregnant did not receive treatment : కాలంతో పరిగెడుతున్నాం.. కానీ కళ్లెదుట జరుగుతున్న ఘోరాలపై కనీస చలనం లేకుండా ఉంటున్నాం. రోజుకో రకం ఖరీదైన కార్లను వాడుతున్న పాలకులు.. ఆపదలో ఉన్న సామాన్యులకు కనీసం ఓ అంబులెన్స్ కూడా ఏర్పాటు చేయలేని దౌర్భాగ్య పరిస్థితిని ప్రశ్నించలేకున్నాం. కొద్దిరోజుల కిందట నందిగామ జనరల్ ఆస్పత్రిలో ఓ మహిళ కడుపునొప్పితో అంబులెన్స్ కోసం ఐదారు గంటలు ఎదురుచూడగా.. ఇటీవల ఆస్పత్రిలో కన్నుమూసిన పసికందు మృతదేహాన్ని ఇంటికి తీసుకువెళ్లేందుకు తల్లిదండ్రులు బైక్‌పై 120 కిలోమీటర్లు ప్రయాణించడం విదితమే.. ఆ రెండు ఘటనల్లో మౌనం మరో శిశువును బలి తీసుకుంది. ఇవాళ అల్లూరి సీతారామరాజు జిల్లాలో మరో దారుణం జరిగింది. నిండు గర్భిణి పురిటి నొప్పులతో అల్లాడుతూ అంబులెన్స్ కోసం ఎదురుచూసింది. ఎంతకీ రాకపోవడంతో డోలీలో తీసుకెళ్లగా ఆ శిశివు ఈ లోకాన్ని చూడకుండానే కన్నుమూసింది.
నేటికీ డోలీలే దిక్కు.. అల్లూరి సీతారామరాజు జిల్లాలో నిండు గర్భిణికి సకాలంలో వైద్యం అందక కడుపులో బిడ్డ అడ్డం తిరిగి మృతి చెందింది. అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట మండలం తీగల వలస పంచాయతీ కొండలలో భాను అనే నిండు గర్భిణికి పురిటి నొప్పులు వచ్చాయి. వెంటనే అంబులెన్స్‌కు ఫోన్ చేయగా.. 'అందుబాటులో లేదు.. వేచి ఉంటే పంపిస్తాం' అని సమాధానం వచ్చింది. వాహనం ఎంతకీ రాకపోవడంతో రెండు కిలోమీటర్ల మేర డోలీలో మోసుకుని వచ్చారు. ఆ తర్వాత ఆటోలో హుకుంపేట తరలించగా ఆసుపత్రిలో మృత శిశువు డెలివరీ అయింది. అంబులెన్స్ సకాలంలో రాకపోవడం వలన ఇటువంటి ఘటన జరిగిందని కుటుంబీకులు ఆరోపిస్తున్నారు.
ఆర్భాటాలు తప్ప ఆచరణేదీ.. ఓ పక్కన ప్రభుత్వం అంబులెన్స్ సకాలంలో పంపిస్తున్నామంటూ ఆర్భాటాలు చేస్తున్నారు తప్ప.. సకాలంలో అవసరమైన ప్రాంతాలకు పంపించి రోగులను తరలించడంలో విఫలమవుతున్నారని ప్రజాసంఘాలు విమర్శిస్తున్నాయి. ఏజెన్సీ కొండ ప్రాంత గిరిజనులకు వైద్యం అందనంత దూరంగా ఉందని, ఈ రోజుల్లోనూ రహదారులు లేక డోలీలే శరణ్యంగా మారాయని కొండ గ్రామస్తులు విలపిస్తున్నారు. వారి ఆవేదన అరణ్య రోదనేనా..? పాలకులు ఇకనైనా కరుణించేనా..?
ప్రసవ వేదన పడుతుంటే ఆశా వర్కర్ సాయంతో ఎంతో ప్రయత్నం చేశారు. మహిళలంతా కలిసి డోలీలో రెండు కిలోమీటర్లు కొండ కింది వరకు మోసుకుని వచ్చారు. అప్పటికీ అంబులెన్స్ రాకపోవడంతో ఆటోలో తీసుకురాగా, సకాలంలో వైద్యం అందక బిడ్డ చనిపోయింది. సమయానికి అంబులెన్స్ వస్తే శిశువు బతికేది. ఆదివాసీల సంక్షేమంలో ప్రభుత్వం ప్రకటనలకే పరిమితమైంది. - కొండలరావు, వైస్ ఎంపీపీ, హుకుంపేట
ఇవీ చదవండి :