Supreme Court judges: గిరిజన సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకోవడం తనకు ఎంతో మధురానుభూతిని కలిగించిందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యూయూ లలిత్ అన్నారు. అరకులోయ అందాలను చూసేందుకు బుధవారం జస్టిస్ లలిత్ సతీసమేతంగా ఇక్కడకు వచ్చారు. విశాఖపట్నం నుంచి కిరండూల్ ప్యాసింజర్‌లో వచ్చిన న్యాయమూర్తి లలిత్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా హైకోర్టు న్యాయమూర్తి అమానుల్లాఖాన్‌లకు.. అరకు రైల్వేస్టేషన్‌లో అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ సుమిత్‌కుమార్, పాడేరు ఐటీడీఏ పీవో గోపాలకృష్ణ స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా గిరిజన సంప్రదాయం ప్రకారం వివాహాలు నిర్వహించే గిరి గ్రామదర్శినిని వారు సందర్శించారు. ఇక్కడ జస్టిస్ లలిత్ దంపతులు వధూవరులుగా మారారు. జస్టిస్ లలిత్ ఆయన సతీమణి అమిత ఉదయ్ లలిత్ గిరిజన సంప్రదాయంలో మరోసారి వివాహం చేసుకున్నారు. పెదలబుడు సర్పంచి పెట్టెలి దాసుబాబు పెళ్లి పెద్దగా వ్యవహరించారు. న్యాయమూర్తి దంపతులు వేడుకను ఆద్యంతం ఆస్వాదించారు. అంతకుముందు జడ్జీలు టాయ్ ట్రైన్‌లో కూర్చొని పద్మాపురం ఉద్యానం తిలకించారు. గిరిజన మ్యూజియాన్ని సందర్శించారు. తిరిగి కిరండూల్ ప్యాసింజర్‌లో విశాఖ వెళ్లారు. జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్ ఆధ్వర్యంలో బందోబస్తు చేపట్టారు.
అతిథి మర్యాదలు బాగున్నాయని, గిరిజన వివాహం చేసుకోవడం మదురానుభూతిని మిగిల్చిందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఉదయ్ ఉమేష్ లలిత్ అన్నారు. జీవితంలో ఎప్పటికీ మరచిపోలేని తీపి గుర్తుగా ఉంటుందని గిరి గ్రామదర్శిని ప్రజలకు, జిల్లా కలెక్టర్‌కు, జిల్లా యంత్రాంగానికి కృతజ్ఞతలు తెలిపారు.
ఇవీ చదవండి: