Fake Maoists arrest: అల్లూరి జిల్లా జి మాడుగుల మండలంలో నకిలీ మావోయిస్టుల ఆటలను పోలీసులు అరికట్టారు. కాంట్రాక్టర్లను బెదిరిస్తూ డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేసిన ముగ్గురు నకిలీ మావోయిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ తుహీర్ సిన్హా చింతపల్లిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అల్లూరి జిల్లా జి మాడుగుల మండల పరిధిలో ఐదుగురు వ్యక్తులు మావోయిస్టులుగా చలామణి అవుతూ.. ఆ ప్రాంతంలో పనులు నిర్వహించే గుత్తేదారులను లక్ష్యంగా చేసుకుని డబ్బులు వసూలు చేస్తున్నారు. స్థానిక గ్రామపెద్దల సహకారంతో వారు గుత్తేదారులను బెదిరిస్తూ డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. డబ్బులు ఇవ్వని పక్షంలో పనులు నిర్వహించే యంత్ర సామగ్రిని కాల్చేస్తామని బెదిరిస్తున్నారు.
ఇదే క్రమంలో గుత్తేదారులు అధికంగా డబ్బులు ఇస్తారనే ఉద్దేశ్యంతో మార్చి 20న కోరుకొండ వద్ద ఎర్రగొప్పలో ఓ జేసీబీని కాల్చేశారు. దీంతోపాటు ఏప్రిల్ 21న అలగాం వంతెన పనులు నిర్వహిస్తున్న ఓ గుత్తేదారుడిని రూ.30 లక్షలు ఇవ్వమని డిమాండ్ చేశారు. డబ్బులు ఇవ్వకుంటే చంపేస్తామని, యంత్ర సామాగ్రిని కూడా కాల్చేస్తామని తమ్మెంగుల, కుడుమసార, లువ్వాసింగి పంచాయతీ సర్పంచుల ద్వారా నకిలీ మావోయిస్టులు హెచ్చరించారు.
దీంతో గత నెల 30వ తేదీన ఆ గుత్తేదారుడు ప్రాణ భయంతో రూ.5 లక్షలు ఇస్తానని.. లువ్వాసింగి సర్పంచి ద్వారా నకిలీ మావోయిస్టులకు సమాచారం అందించారు. దీనిపై నకిలీ మావోయిస్టులు మాకు ముష్టి వేస్తున్నారా..? మాకు రూ.30 లక్షలు ఇవ్వాలి.. అంటూ డిమాండ్ చేశారు. దీంతో గుత్తేదారుడు భయపడి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు అయిదుగురు మావోయిస్టులుపై కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో సోమవారం పోలీసులకు వచ్చిన సమాచారంతో అలగాం వంతెన వద్ద కాపుకాయగా, అయిదుగురు నకిలీ మావోయిస్టుల్లో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా మరో ఇద్దరు నిందితులు పరారయ్యారు.
వీరి నుంచి మూడు మ్యాన్‌ప్యాక్‌లు, రెండు ఎయిర్ పిస్టల్స్, ఒక ఎస్‌బీబీఎల్ తుపాకీతో పాటు రూ.45 వేలు నగదు, సెల్ఫోన్స్, రెండు ద్విచక్రవాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు నకిలీ మావోయిస్టులను అరెస్ట్ చేసి.. కోర్టుకు తరలించినట్లు ఎస్పీ తుహీన్ సిన్హా తెలిపారు. ఈ కేసులో ప్రతిభ చూపిన జి మాడుగుల సీఐ సత్యన్నారాయణ, ఎస్ఐ శ్రీనివాసురావులను అభినందించారు.
ఇవీ చదవండి: