అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగుల మండలంలో ట్రాన్స్‌ఫార్మర్ కాలిపోయి విద్యుత్ సరఫరా నిలిచిపోగా.. 552 మంది పదో తరగతి విద్యార్థులు ఇబ్బంది పడుతున్న పరిస్థితిపై ఈటీవీ భారత్ -ఈనాడు అందించిన కథనానికి విద్యుత్ శాఖ అధికారులు స్పందించారు. యుద్ధ ప్రాతిపదికన విశాఖపట్నం నుంచి ట్రాన్స్‌ఫార్మర్ జి.మాడుగుల తరలించారు. అధికారుల పర్యవేక్షణలో సుమారు 30 మంది మరమ్మతుల పనిలో నిమగ్నమయ్యారు. విద్యుత్ పునరుద్ధరించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నారు. సాయంత్రంలోగా కరెంటు సరఫరా పునరుద్ధరిస్తామని ఏఈ త్రినాథ్ తెలిపారు.
కథనం సారాంశం: పదో తరగతి విద్యార్థులు చీకట్లో చదువులు కొనసాగించాల్సిన దుస్థితి అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగుల మండలంలో నెలకొంది. జి.మాడుగులలోని 33/11కె.వి. సబ్‌స్టేషన్లో కీలకమైన పవర్ ట్రాన్స్‌ఫార్మర్ శనివారం రాత్రి కాలిపోయింది. మండలం మొత్తానికి విద్యుత్తు సరఫరాకు అవసరమైన ఈ ట్రాన్స్‌ఫార్మర్ కాలిపోవడంతో 17 పంచాయతీలు, 435 తండాలు అంధకారంలో చిక్కుకున్నాయి. చింతపల్లి సబ్‌స్టేషన్ నుంచి రోజూ కొన్ని గ్రామాలకు 3 గంటలలోపు మాత్రమే విద్యుత్తు ఇస్తున్నారు. ఈ పరిస్థితుల్లో పదో తరగతి విద్యార్థులు చదువుకోవడానికి ఇబ్బందిపడుతున్నారు.
ఇదీ చదవండి: కరెంటు పెట్టిన కఠిన పరీక్ష.. కొవ్వొత్తుల వెలుగులో విద్యార్థుల చదువు