చుట్టూ పచ్చదనం. ఉట్టిపడే ప్రకృతి రమణీయం. కొంత దూరం ప్రయాణించగానే మంచు దుప్పటి కప్పినట్లు పర్వతశ్రేణులు, నిటారైన పర్వతాల మధ్య బంగీ జంప్, మంచులో రైలు ప్రయాణం.. వీటి గురించి వినగానే.. ఒక్కసారైనా అక్కడ పర్యటించాలని ప్రతి ఒక్కరూ ఆశపడుతుంటారు. ఒకవేళ ఆ ప్రదేశాల్లో పర్యటించి అక్కడి ప్రకృతి అందాల గురించి ప్రచారం చేయమంటే.. ఇంకేముంది ఎంత గొప్ప అవకాశం అని సంబరపడిపోతాం.
భారత్ బల్లెం వీరుడు నీరజ్‌చోప్రాకు ఇప్పుడు ఇదే తరహాలో అరుదైన గౌరవం దక్కింది. స్విట్జర్లాండ్ ప్రభుత్వం ఆయన్ను ఆ దేశ పర్యాటకశాఖ 'ఫ్రెండ్‌షిప్ అంబాసిడర్'గా నియమించింది. ఈ భాగస్వామ్యం ద్వారా ప్రకృతి అందాలకు నెలవైన స్విట్జర్లాండ్‌లోని ప్రముఖ పర్యాటక ప్రదేశాలకు భారత్ సహా ప్రపంచ దేశాల నుంచి ఎక్కువ మంది పర్యాటకులను ఆకర్షించవచ్చని స్విట్జర్లాండ్ భావిస్తోంది. గతేడాది సెప్టెంబరులో జ్యురిచ్‌లో డైమండ్ లీగ్ ఛాంపియన్‌షిప్ గెలిచిన తర్వాత నీరజ్ చోప్రా తన స్నేహితులతో కలిసి స్విట్జర్లాండ్‌లోని ఇంటర్లాకెన్, జెర్మాట్, జెనీవాలో పర్యటించాడు. దీనికి సంబంధించిన వీడియోను నీరజ్ చోప్రా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశాడు.
కారులు లేని గ్రామం.. మంచుకొండల్లో రైలు ప్రయాణం
స్విట్జర్లాండ్‌లో ప్రకృతి రమణీయత ఉట్టిపడే ఆల్ప్స్ పర్వతాలు ప్రధాన ఆకర్షణ. ఇంటర్లాకెన్‌ను స్విట్జర్లాండ్ అడ్వెంచర్ క్యాపిటల్‌గా పిలుస్తారు. అక్కడ స్కై డైవింగ్, జెట్ బోటింగ్, కాన్యాన్ జంపింగ్ వంటి సాహసోపేత ఆటలు పర్యాటకులను విశేషంగా ఆదరిస్తాయి. కారులే ఉండని గ్రామం జెర్మాటాలో మంచుతో నిండిన ఆల్ప్ పర్వతశ్రేణుల్లో కేబుల్ కార్ ప్రయాణం పర్యటకులు తీపి గుర్తుగా మిగిలిపోతుంది.
ఇక్కడ పారాగ్లైడింగ్ చేస్తూ ముఖ్యమైన ప్రదేశాలను బర్డ్ ఐ వ్యూలో చూడొచ్చు. ఇవేకాకుండా ఆల్ప్ పర్వతాల్లో గోర్నెర్‌గ్రాట్‌లో ఉన్న రాతి కట్టడం స్విట్జర్లాండ్‌లో తప్పక చూడాల్సిన ప్రదేశాల్లో ఒకటి. జెర్మాట్ నుంచి గోర్నెర్‌గ్రాట్‌కు రైల్లో చేరుకోవచ్చు. ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ మంచు పర్వతాల గుండా సాగే ఈ రైలు ప్రయాణం మరో మధురానుభూతిని మిగులుస్తుంది. ఇవేకాకుండా నాలుగు వేల మీటర్ల ఎత్తుల్లో జెర్మాట్‌లోని హెలికాఫ్టర్ ప్రయాణం, మంచులో స్కేటింగ్, గొండాలా రైడ్ వంటివి అదనపు ఆకర్షణగా చెప్పుకోవచ్చు.
నీరజ్ చోప్రాకు, స్విట్జర్లాండ్‌తో విడదీయరాని అనుబంధం ఉంది. ఆయన తరచుగా జావెలిన్ త్రో శిక్షణ కోసం స్విట్జర్లాండ్ వెళుతుంటాడు. శిక్షణ అనంతరం అప్పుడప్పుడు ఆ దేశంలోని పర్యాటక ప్రాంతాల్లో విహారిస్తుంటాడు. ఆ విధంగా నీరజ్ చోప్రాకు స్విట్జర్లాండ్‌లోని పర్యాటక స్థలాలపై అవగాహన ఉంది. ఆయన్ను ఫ్రెండ్‌షిప్ అంబాసిడర్‌గా నియమించడం భారత్ సహా, ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షించేందుకు దోహదపడుతుందని స్విట్జర్లాండ్ పర్యాటకశాఖ భావిస్తోంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
- " class="align-text-top noRightClick twitterSection" data="
">