గతేడాది డిసెంబరులో ఖతార్‌లో జరిగిన ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్లో ఫ్రాన్స్‌పై అర్జెంటీనా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. జట్టుకు మెస్సియే కెప్టెన్‌గా వ్యవహరించాడు. అయితే ఆ అపురూప విజయానికి గుర్తుగా తన అర్జెంటీనా జట్టు సభ్యులు, సిబ్బందికి మరపురాని బంగారు ఐఫోన్లు గిఫ్ట్‌లుగా ఇచ్చాడు. రూ.1.72 కోట్లతో ప్రత్యేకంగా తయారు చేయించిన 35 ఐఫోన్‌లను తోటి క్రీడాకారులకు, స్టాఫ్‌కు కానుకలుగా అందజేశాడు
తన తోటి ఆటగాళ్లు, సిబ్బంది ఈ అద్భుత విజయాన్ని ఎప్పటికీ సెలబ్రేట్ చేసుకునేలా వ్యక్తిగత బహుమతులు ఇవ్వాలని మెస్సి భావించాడు. ఈ క్రమంలోనే 24 క్యారెట్ బంగారు స్మార్ట్‌ఫోన్‌లను ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. ఈ విషయమై ఐడిజైన్ గోల్డ్ సంస్థను సంప్రదించాడు. ప్రతి ఫోన్ వెనుక భాగంలో సంబంధిత క్రీడాకారుడు, సిబ్బంది పేరు, షర్ట్ నంబర్, అర్జెంటీనా టీం లోగో, వరల్డ్ కప్ ఛాంపియన్స్ 2022 అని వచ్చేలా ప్రత్యేకంగా డిజైన్ చేయించాడు. ఇటీవలే ఈ ఫోన్‌లను డెలివరీ చేసినట్లు సదరు సంస్థ ధ్రువీకరించింది. సంబంధిత ఫోన్ ఫొటోలను పోస్ట్ చేసింది. ఇవి కాస్త నెట్టింట వైరల్‌గా మారాయి.
కాగా, నరాలు తెగే ఉత్కంఠ నడుమ సాగిన ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ పోరులో డిఫెండింగ్ ఛాంపియన్ ఫ్రాన్స్‌పై అర్జెంటీనా పెనాల్టీ షూటౌట్‌లో 4-2 తేడాతో గెలిచింది. ఈ టోర్నీ విజయంతో అర్జెంటీనా స్టార్ ఆటగాడు మెస్సి కల నెరవేరింది. తన సారథ్యంలో అర్జెంటీనాకు కప్పు రావడం ఇదే తొలిసారి. గతంలో 1978, 1986లో అర్జెంటీనా విశ్వవిజేతగా నిలిచింది.