FIFA World Cup Iran Threats: ఇరాన్-అమెరికా ఫుట్‌బాల్ జట్ల మధ్య మంగళవారం జరగనున్న మ్యాచ్ ప్రతిష్ఠాత్మకంగా మారింది. అమెరికాతో జరిగే మ్యాచ్‌లో తమ ఆటగాళ్ల ప్రవర్తన సరిగ్గా లేకపోతే వారి కుటుంబ సభ్యులపై చర్యలు తీసుకొంటామంటూ ఇరాన్ బెదిరింపులకు పాల్పడినట్లు సీఎన్‌ఎన్ కథనంలో పేర్కొంది. ఇటీవల ఇంగ్లాండ్‌తో మ్యాచ్ సమయంలో ఇరాన్ ఆటగాళ్లలో కొందరు జాతీయగీతం పాడేందుకు విముఖత వ్యక్తం చేయడం సంచలనం సృష్టించింది.
సంబంధిత ఆటగాళ్లతో ఇరాన్ అత్యున్నత భద్రతా సంస్థ 'ది రివల్యూషనరీ గార్డ్స్ కోర్'(ఐఆర్‌జీసీ) సభ్యులు భేటీ అయినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా వారిని ఐఆర్‌జీసీ దళం బెదిరించినట్లు సమాచారం. అనంతరం కోచ్ కార్లోస్ క్యూరోజ్‌తో కూడా వారు సమావేశం అయ్యారు. మరోవైపు అమెరికా సాకర్ ఫెడరేషన్ సోషల్ మీడియా ఖాతాల్లో ఇరాన్ జాతీయ పతాకాన్ని తప్పుగా చూపడం వివాదాన్ని మరింత పెంచింది. ఇరాన్‌లో మహిళలకు మద్దుతుగా తాము ఇలా చేసినట్లు ఆ సంస్థ వివరణ ఇచ్చింది. అమెరికాను ఓడించి ప్రపంచకప్ నుంచి బయటకు పంపించాలని ఇరాన్ మీడియా తమ జట్టుకు పిలుపునిస్తూ కథనాలు రాసింది.
గత శుక్రవారం వేల్స్‌తో ఆడిన రెండో మ్యాచ్‌లో ఇరాన్ ఆటగాళ్ల తమ జాతీయ గీతాన్ని పాడారు. ఈ మ్యాచ్‌లో 2-0తో విజయం సాధించారు. ఖతార్‌లో జరుగుతున్న ప్రపంచకప్‌లో పాల్గొన్న ఇరాన్ జట్టు క్రీడాకారులపై ఓ కన్నేసి పెట్టేందుకు డజన్ల సంఖ్యలో ఐఆర్‌జీసీ సభ్యలు వచ్చారు. ఆటగాళ్లు మరే దేశీయులతో కలవకుండా వీరు కట్టడి చేస్తున్నారు. వాస్తవానికి ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌కు ముందు ఆటగాళ్లకు బహుమతులు, కార్లు ఇస్తామని ప్రభుత్వం చెప్పింది. కానీ, వారు జాతీయ గీతం పాడటానికి నిరాకరించడంతో వారి కుటుంబ సభ్యులను బెదిరించింది.
1979లో ఇరాన్ విప్లవం తర్వాత తొలిసారి అతి తీవ్ర స్థాయిలో ఆందోళనలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు వీటిల్లో 300 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు.