ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ ఏఐఎఫ్‌ఎఫ్‌ను ఫిఫా సస్పెండ్ చేసింది. ధర్డ్ పార్టీల నుంచి అనవసరమైన ప్రభావం ఉన్న కారణంగా... ఫిఫా కౌన్సిల్ బ్యూరో ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని తెలుపుతూ ఓ ప్రకటనను విడుదల చేసింది. "ఫిఫా చట్టాలను తీవ్రంగా ఉల్లంఘించిండం సహా థర్డ్ పార్టీల జోక్యం ఉన్నందున్న ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్‌ను తక్షణమే సస్పెండ్ చేయాలని ఫిఫా కౌన్సిల్ బ్యూరో ఏకగ్రీవంగా నిర్ణయించింది" అని ఫిఫా పేర్కొంది.
సస్పెన్షన్ కారణంగా ఈ ఏడాది అక్టోబర్ 11వ తేదీ నుంచి 30 వరకు భారత్‌లో జరగాల్సిన అండర్-17 మహిళల ప్రపంచ కప్ 2022 టోర్నీపై అనిశ్చితి నెలకొంది. భారత్ నుంచి టోర్నీని మరో దేశానికి తరలించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, భవిష్యత్తులో ఏఐఎఫ్‌ఎఫ్ ఎగ్జిక్యూటీవ్ కమిటీ అధికారాలను చేపట్టేందుకు అడ్మిన్‌స్ట్రేటర్స్ కమిటీ ఏర్పాటు చేయాలన్న ఆదేశాలను ఉపసంహరించుకొన్నాకే.. ఈ సస్పెన్షన్ ఎత్తివేస్తామని ఫిఫా పేర్కొంది. తాము భారత యువజన సర్వీసులు, క్రీడా శాఖతో సంప్రదింపులు జరుపుతుంటామని పేర్కొంది. సానుకూల ఫలితాలు వెలువడవచ్చని ఆశాభావం వ్యక్తం చేసింది.
మరోవైపు భారత ఫుట్‌బాలర్లంతా ప్రపంచ ఫుట్‌బాల్ సమాఖ్య (ఫిఫా) హెచ్చరికల్ని పట్టించుకోకుండా ఆటపైనే దృష్టి పెట్టాలని స్టార్ స్ట్రయికర్ సునీల్ ఛెత్రి సూచించాడు. ఈ విషయంపై ఆటగాళ్లు అతిగా ఆలోచించాల్సిన అవసరం లేదని చెప్పాడు.
ఇదీ చూడండి: చెన్నైతో జడేజా ఇన్నింగ్స్ ముగిసినట్లే