బెంగళూరులోని శిక్షణ శిబిరంలో గత 15 నెలలుగా తాము చాలా కష్టపడ్డామని భారత పురుషుల హాకీ జట్టు కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్ చెప్పాడు. ఈ సమయంలో కుటుంబ సభ్యులను కూడా కలుసుకోలేదని తెలిపాడు. జట్టుగా తామంత పడ్డ కష్టానికి ప్రతిఫలం ఒలింపిక్స్‌లో కాంస్య పతకమని పేర్కొన్నాడు. ఈ సందర్భంగా ఈటీవీ భారత్‌తో పలు విషయాలను పంచుకున్నాడు.
సుదీర్ఘ కాలం తర్వాత ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్టుకు పతకం వచ్చిందని మన్‌ప్రీత్ తెలిపాడు. టోక్యో నుంచి స్వదేశానికి వచ్చినప్పుడు దిల్లీలో తమకు ఘన స్వాగతం లభించిందని.. ఇది తమకెంతో సంతోషాన్ని ఇచ్చిందని అన్నాడు.
సెమీస్‌లో ఓటమి అనంతరం తమకు ప్రధాని మోదీ ఫోన్ చేశారని మన్‌ప్రీత్ గుర్తుచేసుకున్నాడు. "జట్టులోని ఆటగాళ్లందరితో పీఎం మాట్లాడారు. దేశం మొత్తం తమతో ఉందని ధైర్యం చెప్పారు. తదుపరి మ్యాచ్ గురించి ఆందోళన చెందొద్దని.. కాంస్య పతక పోరు కోసం సరిగా సన్నద్ధం కావాలని సూచించారు. మ్యాచ్‌లో గెలుపొందాక మరోసారి ప్రధాని ఫోన్ చేశారు. మిమ్మల్ని చూసి దేశం మొత్తం గర్విస్తోందని అన్నారు" అని మన్‌ప్రీత్ పేర్కొన్నాడు.
జర్మనీతో జరిగిన కాంస్య పతక మ్యాచ్‌లో తమ శక్తి మేరకు రాణించామని మన్‌ప్రీత్ వెల్లడించాడు. 60 నిమిషాల ఆటను జట్టు మొత్తం ప్రాణం పెట్టి ఆడిందని తెలిపాడు. 'ఎందుకంటే ఇది పతక పోరు. ఒలింపిక్స్‌లో చరిత్ర సృష్టిస్తామని తెలుసు. ఈసారి భారత్ అత్యధికంగా ఏడు పతకాలు గెలుచుకుంది. దీంతో అభిమానులు ఇతర ఆటలకు మద్దతు ఇవ్వడం ప్రారంభించారు' అని హాకీ కెప్టెన్ అభిప్రాయపడ్డాడు.
భవిష్యత్‌లో హాకీలో రాణించాలనుకునే వారికి మీరిచ్చే సందేశమేంటని అడగ్గా.. 'హాకీలో రాణించాలంటే ఎల్లప్పుడూ కష్టపడాలి. ప్రత్యేకంగా ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి. ఎందుకంటే ఒక లక్ష్యం కోసం పనిచేసినప్పుడు ప్రతి ఒక్కరూ విజయవంతమవుతారని' మన్‌ప్రీత్ తెలిపాడు.
కాంస్య పతక పోరులో జర్మనీపై 5-4తో గెలుపొందిన భారత్.. 41 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ ఒలింపిక్స్ హకీలో పతకం సాధించింది.
ఇదీ చదవండి: MS Dhoni: చెపాక్ చేరిన సీఎస్కే సింహం.. ప్రాక్టీస్ కోసమే