Virat Kohli Total Wins In Career : వెస్టిండీస్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌ను టీమ్ఇండియా విజయంతో ప్రారంభించింది. తొలి టెస్టులో ఇన్నింగ్స్ 141 పరుగుల తేడాతో ఆతిథ్య జట్టును ఓడించి.. తన WTC సైకిల్‌ను గొప్పగా ఆరంభించింది టీమ్ఇండియా. ఈ క్రమంలో పరుగుల వీరుడు, టీమ్ఇండియా బ్యాటర్ విరాట్ కోహ్లీ ఓ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. టీమ్ఇండియా మాజీ సారధి ధోనీని అధిగమించి.. సచిన్‌ను చేరుకునేందుకు సిద్ధమయ్యాడు. మరి కోహ్లీ సాధించిన ఆ రికార్డు ఏంటో ఓ సారి తెలుసుకుందాం.
టీమ్ఇండియా బ్యాటర్ విరాట్ కోహ్లీ ఇప్పటి వరకూ ఆడిన మ్యాచ్‌ల్లో.. భారత్ జట్టు 296 సార్లు గెలుపొందింది. ఈ జాబితాలో మాజీ కెప్టెన్ ధోనీ(295)ని కోహ్లీ అధిగమించాడు. అయితే.. ఈ జాబితాలో దిగ్గజ క్రికెటర్ సచిన్(307) అందరికంటే ముందున్నాడు. మరిన్ని విజయాలు తోడైతే.. కోహ్లీ అగ్రస్థానంలోకి వచ్చే అవకాశం ఉంది.
ఈ జాబితాలో ఎవరు ఎక్కడ ఉన్నారంటే..
- సచిన్ -307
- విరాట్ కోహ్లీ - 296
- ఎంఎస్ ధోనీ - 295
- రోహిత్ శర్మ -277
- యువరాజ్ సింగ్ -227
- రాహుల్ ద్రవిడ్ -216
Team India Test Ranking 2023 : ఇక టీమ్‌ఇండియా టెస్టుల్లో నంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది. అయితే.. విండీస్‌పై 2-0తేడాతో గెలిచినా.. అగ్రస్థానంలో ఉంటుందని కచ్చితంగా చెప్పలేం. ఎందుకంటే ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్న ఆసీస్.. యాషెస్ సిరీస్‌లో మరో రెండు టెస్టుల్లో గెలిస్తే.. తొలి స్థానానికి చేరుకునే అవకాశం ఉంది.
కింగ్ కోహ్లీ.. మరో ఘనత
Virat Kohli Total Matches In All Formats : కింగ్ కొహ్లీ మరో రికార్డుకు చేరువలో ఉన్నాడు. ఇప్పటి వరకు టెస్టు, వన్డే, టీ20ల్లో కలిపి 499 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడాడు. జూలై 20న విండీస్‌తో టెస్ట్ ఆడితో అన్ని ఫార్మాట్లలో కలిపి కోహ్లీ 500వ మ్యాచ్‌లు ఆడినట్లవుతుంది. అప్పుడు కొహ్లీ అన్ని ఫార్మాట్లలో కలిపి 500 మ్యాచ్‌లు ఆడిన పదో ఆటగాడిగా ఘనత సాధించనున్నాడు.
- సచిన్(ఇండియా)- 664 మ్యాచ్‌లు
- జయవర్ధనే(శ్రీలంక)- 652 మ్యాచ్‌లు
- సంగక్కర(శ్రీలంక)- 594 మ్యాచ్‌లు
- పాంటింగ్ (ఆస్ట్రేలియా)-560 మ్యాచ్‌లు
- ధోనీ (ఇండియా)- 538 మ్యాచ్‌లు
- అఫ్రిది (పాకిస్థాన్)- 524 మ్యాచ్‌లు
- జాక్ కలిస్ (సౌతాఫ్రికా)-519 మ్యాచ్‌లు
- ద్రవిడ్(ఇండియా)- 509 మ్యాచ్‌లు
Virat Kohli Total Runs In All Formats : కొహ్లీ ఇప్పటి వరకు 110 టెస్టుల్లో 8,555 పరుగులు, 274 వన్డేల్లో 12,898 పరుగులు, 115 టీ20లు ఆడి 4,008 పరుగులు చేశాడు. మొత్తం మూడు ఫార్మాట్లలో కలిపి 25,461 పరుగులు చేశాడు.