బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్‌కు రిషభ్ పంత్ దూరమైన విషయం తెలిసిందే. వైద్య సిబ్బంది సూచనల మేరకు అతడికి విశ్రాంతినిచ్చినట్టు బీసీసీఐ దీనిపై స్పష్టతనిచ్చింది. అయినప్పటికీ ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో రానున్న వన్డేల్లో కేఎల్ రాహుల్‌కు మిడిలార్డర్, వికెట్ కీపర్ బాధ్యతలను అప్పగించేందుకు టీమ్‌మేనేజ్‌మెంట్ సిద్ధమైంది. ఈ విషయంపై రాహుల్ తాజాగా స్పందించాడు.
"వన్డేల్లో వికెట్ కీపర్, మిడిలార్డర్ బ్యాటర్ పాత్ర పోషించడానికి సిద్ధంగా ఉండాలంటూ టీమ్‌మేనేజ్‌మెంట్ నన్ను అడిగింది. మేం గత 8-9 నెలల్లో ఈ ఫార్మాట్‌లో ఎక్కువగా ఆడలేదు. కానీ, 2020-21 మధ్య నేను 4, 5 స్థానాల్లో బ్యాటింగ్‌కు దిగాను. అందుకే ఈ పాత్ర కోసం టీమ్‌మేనేజ్‌మెంట్ నన్ను సిద్ధంగా ఉండాలని కోరి ఉంటుంది" అని తెలిపాడు. పంత్ విషయంపై మాట్లాడుతూ.. "రిషభ్ పంత్ ఈ సిరీస్‌కు దూరం కానున్నాడని ప్రకటించిన రోజే నాకూ తెలిసింది. అతడి విశ్రాంతికి గల కారణాలపై బీసీసీఐ వైద్య సిబ్బందే సరైన సమాధానం చెప్పగల్గుతారు" అని తెలిపాడు. కాగా, బంగ్లాతో తొలి వన్డేలో రాహుల్ 73 పరుగులు చేసినప్పటికీ.. మెహదీ హసన్ క్యాచ్‌ను వదిలేయడంతో టీమ్‌ఇండియా ఓటమి బాట పట్టింది.
ఇదీ చూడండి: బీసీసీఐ మరో కీలక నిర్ణయం.. పురుషుల క్రికెట్‌లో మహిళా అంపైర్లు!