క్లీన్‌స్వీప్‌పై కన్నేసిన భారత్ బుధవారం జరిగే మూడో వన్డేలో వెస్టిండీస్‌ను ఢీకొంటుంది. ఇప్పటికే సిరీస్ సొంతమైనప్పటికీ టీమ్‌ఇండియా తుది జట్టులో ఎక్కువ మార్పులు జరగకపోవచ్చు. ముఖ్యంగా బ్యాటింగ్ లైనప్‌ను కదపకపోవచ్చు. వరుసగా 64, 43 చేసిన శుభ్‌మన్ గిల్‌ను కాదని రుతురాజ్ గైక్వాడ్‌కు చోటు కల్పించే పరిస్థితి లేదు. దక్షిణాఫ్రికాతో సిరీస్‌లో అవకాశాలు దక్కించుకున్నా రుతురాజ్ అసౌకర్యంగా కనిపించాడు. శ్రేయస్ అయ్యర్, సంజు శాంసన్ రెండో వన్డేలో అర్ధశతకాలు బాది ఫామ్‌లో ఉన్నారు. తొలి రెండు వన్డేల్లో విఫలమైనప్పటికీ సూర్యకుమార్ యాదవ్ స్థానానికి వచ్చిన ఢోకా ఏమీ లేదు. ఇషాన్ కిషన్ పెవిలియన్‌కే పరిమితం కాక తప్పదు. ఇక చిన్న గాయం వల్ల తొలి రెండు మ్యాచ్‌ల్లో ఆడలేకపోయిన తొలి ప్రాధాన్య ఆల్‌రౌండర్ జడేజా.. ఆఖరి మ్యాచ్‌లో ఆడడంపైనా అనిశ్చితి నెలకొంది.
అయితే అక్షర్ పటేల్ గత మ్యాచ్‌లో 64 పరుగుల అజేయ ఇన్నింగ్స్‌తో భారత్‌ను విజయపథంలో నడిపించిన సంగతి తెలిసిందే. ఒకవేళ కెప్టెన్ ధావన్ ఇద్దరు ఎడమచేతి వాటం స్పిన్నర్లు కావాలనుకుంటే చాహల్‌కు విశ్రాంతినిచ్చే అవకాశముంది. కానీ జట్టు బౌలింగ్‌లో అప్పుడు వైవిధ్యం లోపిస్తుంది. అవేష్ ఖాన్ స్థానంలో అర్ష్‌దీప్ సింగ్‌ను తీసుకునే అవకాశం ఉంది. రెండో వన్డేలో అవేష్ 6 ఓవర్లలోనే 54 పరుగులిచ్చాడు. మరోవైపు జట్టులో సమర్థులైన ఆటగాళ్లున్నా సమష్టిగా రాణించలేకపోవడం విండీస్‌కు పెద్ద సమస్య. హోప్, పూరన్, రోమన్ పావెల్‌ల వ్యక్తిగత ప్రదర్శనలపై ఆ జట్టు మరీ ఎక్కువగా ఆధారపడుతోంది. మరి ఈ మ్యాచ్‌లో ఎలా ఆడుతుందో చూడాలి. రెండో మ్యాచ్‌లో నెగ్గడం ద్వారా వెస్టిండీస్‌పై వరుసగా 12వ వన్డే సిరీస్ విజయం సాధించిన భారత్.. ఓ జట్టుపై వరుసగా అత్యధిక సిరీస్‌లు నెగ్గిన జట్టుగా ప్రపంచ రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే.
ఇదీ చదవండి: నేనెప్పటికీ అతడి స్థాయికి చేరుకోలేను: ద్రవిడ్