సంజూ శాంసన్ అభిమానులకు బ్యాడ్ న్యూస్. తొలి వన్డేలో గాయపడిన సంజూ.. గురువారం పుణె వేదికగా శ్రీలంకతో జరగనున్న రెండో టీ20లో ఆడటం అనుమానంగా మారింది. రెండో టీ20 కోసం భారత జట్టు ముంబయి నుంచి పుణె బయల్దేరి వెళ్లగా... మోకాలి నొప్పితో బాధపడుతున్న శాంసన్ స్కానింగ్ కోసం ముంబయిలోనే ఉండిపోయాడు.
శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో.. తొలి ఓవర్లోనే క్యాచ్ అందుకునే ప్రయత్నంలో శాంసన్ డైవ్ చేశాడు. బంతిని అందుకున్నప్పటికీ.. దాన్ని ఒడిసిపట్టుకోలేకపోయాడు. ఆ సమయంలోనే అతడి మోకాలికి దెబ్బ తాకింది. అయినా ఆ తర్వాత ఫీల్డింగ్ చేశాడు. కానీ తర్వాత మోకాలు వాపు రావడం వల్ల చికిత్స తీసుకోవాల్సి వచ్చింది. దీంతో రెండో మ్యాచ్‌లో శాంసన్ ఆడేది అనుమానంగా మారింది. మెడికల్ టీం స్కానింగ్ రిపోర్టులను పరిశీలించిన తర్వాతే మేనేజ్‌మెంట్ అతడిని ఆడించే విషయంలో నిర్ణయం తీసుకోనుంది.
ఒకవేళ రెండో టీ20కి శాంసన్ దూరమైతే అతడిది నిజంగా దురదృష్టమే. ఎందుకంటే.. అవకాశాల కోసం సంజూ చాలా కాలంగా ఎదురు చూస్తున్నాడు. ఇప్పటికే ఆసియా కప్, టీ20 వరల్డ్ కప్ విషయంలో శాంసన్‌ను మేనేజ్‌మెంట్ పక్కనపెట్టి ఆడించలేదు. న్యూజిలాండ్‌తో సిరీస్‌లో ఒక్క వన్డేలో మాత్రమే అతడికి ఆడే అవకాశం లభించింది.
కాగా, లంకతో జరిగిన తొలి టీ20లో సంజూ బ్యాట్‌తో పాటు ఫీల్డింగ్‌లోనూ నిరాశపరిచాడు. అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఫీల్డింగ్‌లోనూ కీలక క్యాచ్‌ను జారవిడిచి విమర్శలు ఎదుర్కొన్నాడు. లంక ఇన్నింగ్స్‌లో హార్దిక్ వేసిన తొలి ఓవర్‌లో నిస్సంక ఇచ్చిన క్యాచ్‌ను జాడవిరిచాడు.
ఇదీ చూడండి: సూర్య భాయ్.. ఎంత టాలెంట్ ఉన్నా ఇలా చేయడం సరికాదేమో!