Rohith sharma about Teamindia Bench టీమ్ఇండియాకు బలమైన రిజర్వ్ బెంచ్‌ను ఏర్పాటు చేయడం తమ ప్రధాన లక్ష్యమని భారత క్రికెట్ జట్టు సారథి రోహిత్ శర్మ అన్నాడు. ఎందుకంటే.. బుమ్రా, షమీలాంటి సీనియర్ ఆటగాళ్లు ఎప్పటికీ జట్టుకు అందుబాటులో ఉండకపోవచ్చు కదా అని అభిప్రాయపడ్డాడు. అందుకే బెంచ్‌ను పటిష్ఠం చేసేందుకు ఉన్న మార్గాలపై జట్టు మేనేజ్‌మెంట్ దృష్టిపెట్టిందని వివరించాడు.
"బుమ్రా, షమీ లాంటి ఆటగాళ్లు ఎప్పటికీ టీమ్‌ఇండియాతోనే ఉండిపోరు. అందువల్ల, ఇతర ఆటగాళ్లను కూడా సిద్ధం చేయాల్సిన అవసరం ఉంది. బెంచ్‌ను ఎలా పటిష్ఠం చేయాలన్న దానిపై నేను, రాహుల్ భాయ్(రాహుల్ ద్రవిడ్) చర్చలు జరుపుతున్నాం. ఎక్కువ మ్యాచ్‌లు, ఆటగాళ్లకు గాయాల వంటివి ఎదురైనప్పుడు బెంచ్ బలంగా ఉంటే ఎంతో దోహదపడుతుంది. కేవలం ఒకరు లేదా ఇద్దరు ఆటగాళ్లపై ఆధారపడే జట్టుగా మేం ఉండకూడదని అనుకుంటున్నాం. ప్రతి ఒక్కరి సహకారంతో సమష్టిగా గెలవాలనుకుంటున్నాం. అందుకే, యువ ఆటగాళ్లకు సాధ్యమైనంత ఎక్కువ అవకాశాలు కల్పించేలా ప్రయత్నాలు చేస్తున్నాం. సీనియర్లతో కలిపి ఆడిస్తే వారూ నేర్చుకుంటారు. జింబాబ్వే సిరీస్‌లోనూ చాలా మందికి తొలిసారి అవకాశం వచ్చింది. వారు ఆ అవకాశాన్ని రెండు చేతులా సద్వినియోగం చేసుకొని రాణిస్తారని విశ్వాసంగా ఉన్నా" అని రోహిత్ చెప్పుకొచ్చాడు.
అవన్నీ అర్థం లేని మాటలే.. ఈ సందర్భంగా వన్డే క్రికెట్ భవిష్యత్ గురించి వస్తున్న అభిప్రాయాలపైనా రోహిత్ స్పందించాడు. "వన్డేలు ప్రభ కోల్పోతున్నాయని చెప్పడంలో అర్థం లేదు. అంతకుముందు టెస్టు సిరీస్‌లు కూడా ప్రమాదంలో పడ్డాయనే అభిప్రాయాలు వినిపించాయి. కానీ, నా వరకు క్రికెట్ ముఖ్యం. అది ఏ ఫార్మాట్ అయినా సరే. వన్డేలు లేదా టీ20లు లేదా టెస్టులు చివరి దశకు చేరుకుంటాయని నేను అనుకోను. ఇంకా చెప్పాలంటే మరో కొత్త ఫార్మాట్ వచ్చినా బాగుంటుంది. నాకు వన్డేలతోనే మంచి గుర్తింపు లభించింది. ఇక ఏ ఫార్మాట్‌లో ఆడాలి.. ఏ ఫార్మాట్‌లో ఆడొద్దు అన్నది పూర్తిగా ఆటగాడి వ్యక్తిగత నిర్ణయమే" అని రోహిత్ తెలిపాడు.
ఇక, త్వరలో జరగబోయే ఆసియా కప్ టోర్నీలో భారత్, పాక్ మ్యాచ్ గురించి మాట్లాడుతూ.. "గతేడాది టీ20 ప్రపంచకప్‌లో ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ జరిగినప్పుడు టీమిండియా ఓటమిపాలైంది. అయితే అప్పటి జట్టుకు ఇప్పటి జట్టుకు తేడా ఉంది. ఆటతీరులోనూ మార్పులు వచ్చాయి. అందువల్ల ఈసారి ఫలితం కూడా మారుతుందని ఆశిస్తున్నా" అని చెప్పుకొచ్చాడు.
ఇదీ చూడండి: ప్రపంచకప్‌పై కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన