Rajat Patidar: ఐపీఎల్ ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఆర్సీబీకి అద్భుత విజయాన్ని అందించాడు రజత్ పటీదార్. మెరుపు శతకంతో జట్టుకు భారీ స్కోరు అందించి విజయంలో కీలక పాత్ర పోషించాడు. విరాట్ కోహ్లీ, ఫాప్ డుప్లెసిస్ వంటి దిగ్గజ ఆటగాళ్లు పరుగులు చేయడానికి ఇబ్బందిపడ్డ చోట చూడచక్కని షాట్లు ఆడాడు. ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడి లఖ్‌నవూ బౌలర్లను బెంబేలెత్తించాడు. అంతేకాదు ఐపీఎల్ ప్లే ఆఫ్స్‌లో ఆర్సీబీ తరఫున సెంచరీ చేసిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌తో హీరోగా మారిన రజత్ పటీదార్‌ను ఐపీఎల్ వేలంపాటలో ఎవరూ కొనుగోలు చేయలేదంటే నమ్మగలరా? కానీ ఇది నిజం. గతేడాది ఆర్సీబీ తరఫున నాలుగు మ్యాచ్‌లు ఆడి ఓ మ్యాచ్‌లో 71 పరుగులు చేసినప్పటికీ.. అతని కోసం కనీస ధర రూ.20లక్షలు చెల్లించేందుకు కూడా ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపలేదు. దీంతో అతను అమ్ముడుపోని ఆటగాళ్ల జాబితాలో మిగిలాడు.
IPL Emilinator: అయితే పటీదార్‌కు ఈసారి అదృష్టం కలిసొచ్చింది. ఆర్సీబీ ప్లేయర్ లవ్నిత్ సిసోడికి గాయం కారణంగా టోర్నీ నుంచి తప్పుకోవడం వల్ల అతని స్థానాన్ని భర్తీ చేసేందుకు పటీదార్‌ను జట్టులోకి తీసుకున్నారు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని పటీదార్ ప్లే ఆఫ్స్ మ్యాచ్‌లో చోటు దక్కించుకున్నాడు. ఇక మ్యాచ్‌లో విశ్వరూపం ప్రదర్శించి తన సత్తా ఏంటో అందరికీ తెలియజేశాడు. 52 బంతుల్లో 207 స్ట్రయిక్ రేట్‌తో 12 ఫోర్లు, 7 సిక్సర్లు బాది అజేయంగా నిలిచాడు. దీంతో ఆర్సీబీ 207 పరుగుల భారీ స్కోరు చేసింది. ఛేదనలో లఖ్‌నవూ 193 పరుగులే చేసింది. ఫలితంగా 14 పరుగుల తేడాతో గెలిచి ఆర్సీబీ క్వాలిఫయర్స్ 2కు చేరింది. మే 27న జరిగే ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో తలపడనుంది. గెలిస్తే ఫైనల్లో టైటిల్ కోసం గుజరాత్ టైటాన్స్‌ను ఢీకొంటుంది. ఈ రెండు మ్యాచ్‌లు అహ్మదాబాద్ వేదికగానే జరగనున్నాయి.
IPL News: మ్యాచ్ అనంతరం ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు తీసుకుంటూ పటీదార్ మాట్లాడాడు. పవర్ ప్లే చివరి ఓవర్లలో కృనాల్ పాండ్య బౌలింగ్‌లో భారీ షాట్లు ఆడిన తర్వాత తనలో ఆత్మవిశ్వాసం పెరిగిందని చెప్పాడు. అప్పటి నుంచి మరింత స్వేచ్ఛగా బ్యాటింగ్ చేసినట్లు వివరించాడు. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించడం, తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నందుకు ఆనందంగా ఉందన్నాడు. రాజస్థాన్‌తో పోరు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నాడు.
ఇదీ చదవండి: రాహుల్ పోరాడినా.. ప్లేఆఫ్స్ నుంచి లఖ్‌నవూ ఔట్.. ఆర్సీబీ ముందంజ