Umran Malik Fastest Ball: 151.8, 152.3, 153.1, 153.3.. ఇవీ ఉమ్రాన్ మాలిక్ బంతులు విసురుతున్న వేగం తాలూకు గణాంకాలు! ఒక మ్యాచ్‌ను మించి మరో మ్యాచ్‌లో అన్నట్లుగా ఈ హైదరాబాద్ పేసర్ వేగం పెరుగుతుందే కానీ తగ్గట్లేదు. హైదరాబాద్ తరఫున బుల్లెట్ బంతులతో గత సీజన్లో అందరినీ ఆకర్షించిన 22 ఏళ్ల ఈ శ్రీనగర్ బౌలర్‌ను ఈ సీజన్‌కు ఆ జట్టు అట్టిపెట్టుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఈసారి సీజన్లో అతడు రాణిస్తున్నాడు. ముఖ్యంగా అతడి వేగం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
ఈసారి సీజన్‌లో అత్యంత వేగంగా బంతులు వేసిన బౌలర్ల జాబితా చూస్తే.. టాప్-5లో అన్ని పేర్లూ ఉమ్రాన్‌వే. అందుకే సామాజిక మాధ్యమాల్లో ఉమ్రాన్ పేరు మీద పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. మైదానానికి రావడం.. రికార్డు వేగంతో బంతి విసరడం.. ఇందుకు గాను ఇచ్చే రూ.లక్ష బహుమతిని సొంతం చేసుకోవడం ఇదే అతడి దినచర్యగా మారిపోయిందంటూ సరదా వ్యాఖ్యానాలు కనిపిస్తున్నాయి ఉమ్రాన్ మీద. ఉమ్రాన్ వేగం.. అతడి వయసు దృష్టిలో పెట్టుకుంటే భారత్‌కు ఓ మంచి పేసర్ సిద్ధంగా ఉన్నట్లేనని హర్ష భోగ్లే, రవిశాస్త్రి లాంటి వ్యాఖ్యాతలు అభిప్రాయపడుతున్నారు. అతడిని సరిగ్గా దిద్దుకుంటే భవిష్యత్‌లో టీమ్‌ఇండియాలో చూడొచ్చని మాజీలు అంటున్నారు. 2021 టీ20 ప్రపంచకప్‌లో భారత్‌కు నెట్ బౌలర్‌గా వ్యవహరించిన ఉమ్రాన్.. భారత జట్టుకు ఆడాలనే ఉత్సాహంతో ఉన్నాడు. వాయు వేగంతో బంతులేసే ఉమ్రాన్.. బంతిని ఇన్‌స్వింగ్ చేస్తూ బ్యాటర్లకు పరీక్ష పెడుతున్నాడు. గంటకు 150 కి.మీ వేగంతో బంతులు వేసిన చేత్తోనే ఉన్నట్టుండి వేగాన్ని తగ్గించి బ్యాటర్లను బోల్తా కొట్టిస్తున్నాడు. అయితే ఉన్నట్టుండి లైన్ తప్పిపోవడం, అనసవర పరుగులు ఇవ్వడం లాంటి బలహీనతల్ని అతను అధిగమించాల్సి ఉంది.
ఇదీ చూడండి: సన్‌రైజర్స్‌కు భారీ ఎదురుదెబ్బ.. కీలక ప్లేయర్‌కు గాయం