IPL 2022 Virat Kohli: టీమ్‌ఇండియా దిగ్గజ ఆటగాడు విరాట్ కోహ్లీ మరో అరుదైన రికార్డుకు చేరువయ్యాడు. టీ20 మెగా టోర్నీలో భాగంగా మరి కాసేపట్లో చెన్నై జట్టుతో జరగనున్న మ్యాచ్‌లో కోహ్లీ 52 పరుగులు నమోదు చేస్తే.. ఒకే ఫ్రాంఛైజీపై 1000 పరుగులు చేసిన రెండో ఆటగాడిగా నిలవనున్నాడు. ఇప్పటి వరకు చెన్నైపై కోహ్లీ 948* పరుగులు చేశాడు. ప్రస్తుత టీమ్‌ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. కోహ్లీ కంటే ముందున్నాడు. రోహత్ కోల్‌కతా జట్టుపై ఇప్పటి వరకు 1018* పరుగులు బాదేశాడు.
2008లో విరాట్ కోహ్లీ టీ20 లీగ్‌లోకి అడుగు పెట్టాడు. అప్పటి నుంచి బెంగళూరు ఫ్రాంఛైజీ తరఫున కొనసాగుతున్నాడు. ఇప్పటి వరకు కోహ్లీ ఆడిన 211 మ్యాచుల్లో 6389 పరుగులు చేసి అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఇందులో ఐదు శతకాలు, 42 అర్ధ శతకాలు ఉండటం విశేషం. 2016 సీజన్‌లో 950 పరుగులు చేసి రికార్డు నమోదు చేశాడు.
ప్రస్తుత సీజన్‌లో బెంగళూరు జట్టు నిలకడగా రాణిస్తోంది. కొత్త కెప్టెన్ డు ప్లెసిస్ నాయకత్వంలో ఇప్పటి వరకు ఆడిన నాలుగు మ్యాచుల్లో మూడింట్లో విజయం సాధించింది. బెంగళూరు జట్టు మరి కాసేపట్లో చెన్నైతో తలపడనుంది. ఈ మ్యాచులో కోహ్లీ సరికొత్త రికార్డును నమోదు చేస్తాడేమో చూడాలి.!
ఇదీ చూడండి: మైదానంలోకి రోహిత్ అభిమాని.. కోహ్లీ ఫిదా.. ఏం చేశాడంటే?