IPL 2022: టీ20 మెగా టోర్నీలో ముంబయి పరాజయాల పరంపర కొనసాగుతోంది. వరుసగా ఐదో మ్యాచులోనూ ఓటమి పాలైంది. పంజాబ్‌తో జరిగిన మ్యాచులో 12 పరుగుల తేడాతో ఓడిపోయింది. పంజాబ్ నిర్దేశించిన 199 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబయి 186 పరుగులకే పరిమితమైంది. ముంబయి బ్యాటర్లలో డెవాల్డ్ బ్రెవీస్ (49 : 25 బంతుల్లో 4×4, 5×6) మెరుపు ఇన్నింగ్స్‌తో అలరించాడు. క్రీజులో ఉన్నంత సేపు బౌండరీలతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. సూర్యకుమార్ యాదవ్ (43) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. తిలక్ వర్మ (36), కెప్టెన్ రోహిత్ శర్మ (28) పరుగులతో రాణించారు. అయినా కీలక సమయంలో పంజాబ్ బౌలర్లు పుంజుకోవడం వల్ల ముంబయి బ్యాటర్ల పోరాటం వృథా అయ్యింది. ఓపెనర్ ఇషాన్ కిషన్ (3), కీరన్ పొలార్డ్ (10), జయదేవ్ ఉనద్కత్ (12) విఫలమయ్యారు. బుమ్రా (0) డకౌటయ్యాడు. ఆఖరు బంతికి టైమల్ మిల్స్ (0) క్యాచ్ ఔటయ్యాడు. మురుగన్ అశ్విన్ (0) నాటౌట్‌గా నిలిచాడు. పంజాబ్ బౌలర్లలో ఓడీన్ స్మిత్ నాలుగు, కగిసో రబాడ రెండు వికెట్లు తీయగా.. వైభవ్ అరోరా ఓ వికెట్ పడగొట్టాడు.
తొలుత బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ కింగ్స్ అదరగొట్టింది. ఓపెనర్ శిఖర్ ధావన్ (70 : 50 బంతుల్లో 5×4, 3×6), కెప్టెన్ మయాంక్ అగర్వాల్ (52 : 32 బంతుల్లో 6×4, 2×6) అర్ధ శతకాలతో రాణించడం వల్ల పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 198 పరుగులు చేసింది. ముంబయి ముందు 199 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. పంజాబ్ బ్యాటర్లలో జానీ బెయిర్ స్టో (12), లియామ్ లివింగ్‌స్టోన్ (2), విఫలమయ్యారు. ఆఖర్లో వచ్చిన షారుఖ్ ఖాన్ (15) రెండు సిక్సులు బాది క్రీజు వీడాడు. జితేశ్ శర్మ (30), ఓడీన్ స్మిత్ (1) పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. ముంబయి బౌలర్లలో బాసిల్ తంపి రెండు వికెట్లు తీయగా, జయదేవ్ ఉనద్కత్, జస్ప్రీత్ బుమ్రా, మురుగన్ అశ్విన్ తలో వికెట్ పడగొట్టారు.
ఇదీ చదవండి: IPL 2022: టాస్ గెలిచిన ముంబయి.. పంజాబ్ బ్యాటింగ్