ఐపీఎల్ 14వ సీజన్ మరికొద్ది గంటల్లో ప్రారంభంకానుంది. కరోనా కారణంగా గతేడాది యూఏఈలో జరిగిన లీగ్‌ను ఈసారి స్వదేశంలోనే నిర్వహించనున్నారు. అయితే పొట్టి ఫార్మాట్‌ను బ్యాట్స్‌మెన్ గేమ్‌గా అభిప్రాయపడతారు. కానీ కొందరు బౌలర్లూ తమ జట్లకు విజయాలనందించిన సందర్భాలు ఉన్నాయి. ఐపీఎల్‌లోనూ ఇలా జరిగింది. ఈ నేపథ్యంలో ఈ లీగ్‌లో ఆధిపత్యం వహించి అత్యధిక వికెట్లు సాధించిన టాప్-5 బౌలర్లు ఎవరో చూద్దాం.
లసిత్ మలింగ
![bowlers with most wickets in IPL history](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11340437_1.jpg)
ఐపీఎల్ చరిత్రలో గొప్ప బౌలర్‌గా పేరు సంపాందించాడు ముంబయి ఇండియన్స్ పేసర్ లసిత్ మలింగ. 122 మ్యాచ్‌లు ఆడి 170 వికెట్లతో రికార్డు సృష్టించాడు. ఇందులో 108 వికెట్లు డెత్ ఓవర్లలో సాధించినవే. ఎకానమీ 7.14గా ఉంది. 2009లో ముంబయి ఫ్రాంఛైజీ ఇతడిని కొనుగోలు చేయగా 2019 వరకు ఆ జట్టుకే ఆడాడు. 2019 ఫైనల్లో మలింగ వేసిన ఆఖరి ఓవర్ అభిమానులకు ఇప్పటికే గుర్తుండే ఉంటుంది. లీగ్‌లో అదే ఇతడికి ఆఖరి మ్యాచ్. గతేడాది వ్యక్తిగత కారణాల వల్ల సీజన్‌కు దూరమైన మలింగ.. ఈ ఏడాది వేలానికి ముందు రిటైర్మెంట్ ప్రకటించాడు.
అమిత్ మిశ్రా
![bowlers with most wickets in IPL history](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11340437_2.jpg)
టీమ్ఇండియా సీనియర్ స్పిన్నర్ అమిత్ మిశ్రా ఐపీఎల్లో 150 మ్యాచ్‌ల్లో 160 వికెట్లు సాధించాడు. లీగ్‌లో అత్యధిక వికెట్లు సాధించిన వారి జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. ప్రస్తుతం ఇతడు దిల్లీ క్యాపిటల్స్‌కు ఆడుతున్నాడు. ఎకానమీ 7.34గా ఉంది.
పీయూష్ చావ్లా
![bowlers with most wickets in IPL history](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11340437_3.jpg)
ఐపీఎల్ 2021 వేలంలో పీయూష్ చావ్లాను ముంబయి ఇండియన్స్ కొనుగోలు చేసింది. ఇప్పటివరకు 164 మ్యాచ్‌లు ఆడిన ఇతడు 156 వికెట్లు సాధించాడు. ఎకానమీ 7.87గా ఉంది. లీగ్‌లో చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్, పంజాబ్ కింగ్స్కూ ప్రాతినిథ్యం వహించాడు పీయూష్.
డ్వేన్ బ్రావో
![bowlers with most wickets in IPL history](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11340437_4.jpg)
ఐపీఎల్లో 140 మ్యాచ్‌లాడిన బ్రావో 153 వికెట్లు సాధించి లీగ్‌లో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్ల జాబితాలో నాలుగో స్థానంలో నిలిచాడు. అలాగే లీగ్‌లో మలింగ తర్వాత అత్యధిక వికెట్లు సాధించిన రెండో పేసర్ ఇతడే. బ్రావో ఎకానమీ 8.40గా ఉంది. ధోనీ సారథ్యంలోని చెన్నైకి డెత్ ఓవర్లలో అద్భుత ప్రదర్శన చేస్తున్నాడీ పేసర్.
హర్భజన్ సింగ్
![bowlers with most wickets in IPL history](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11340437_5.jpg)
ఐపీఎల్లో 160 మ్యాచ్‌లాడిన హర్భజన్ సింగ్ 150 వికెట్లతో ఐదో స్థానంలో నిలిచాడు. లీగ్‌లో ఇతడి ఎకానమీ 7.05గా ఉంది. గతేడాది వ్యక్తిగత కారణాల వల్ల లీగ్‌కు దూరమైన భజ్జీని చెన్నై సూపర్ కింగ్స్ ఈ ఏడాది వేలానికి ముందు విడుదల చేసింది. దీంతో ఇతడిని కోల్‌కతా నైట్‌రైడర్స్ కొనుగోలు చేసింది.
ఆ తర్వాత ఈ జాబితాలో వరుసగా రవిచంద్రన్ అశ్విన్ (138), భువనేశ్వర్ కుమార్ (136), సునీల్ నరైన్ (127), చాహల్ (121), ఉమేశ్ యాదవ్ (119) టాప్-10లో నిలిచారు.
ఇదీ చూడండి: ఐపీఎల్ 2021: బరిలో దిగితే రికార్డులే!