టీ20 ప్రపంచకప్‌లో(T20 World Cup 2021) పాల్గొనేందుకు అఫ్గానిస్థాన్ జట్టు సిద్ధంగా ఉందని అంతర్జాతీయ క్రికెట్ మండలి(ICC CEO) సీఈఓ జియోఫ్ అలాడైస్ వెల్లడించాడు. అయితే ఆ దేశంలో నెలకొన్న పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తున్నామని తెలిపాడు. అఫ్గాన్‌లో ప్రస్తుతం తాలిబన్లు ప్రభుత్వం ఏర్పాటైన నేపథ్యంలో వారి జెండాతో టోర్నీలో ఆడాలనుకుంటే మాత్రం ఆ జట్టుపై ఐసీసీ నిషేధం విధించే అవకాశం ఉందని తెలుస్తోంది.
"ఐసీసీలో అఫ్గాన్ క్రికెట్ బోర్డు పూర్తి సభ్యత్వం కలిగి ఉంది. టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనేందుకు ఆ దేశ జట్టు సిద్ధమవుతోంది. షెడ్యూల్ ప్రకారం జరిగే మ్యాచ్‌ల్లో వారు పాల్గొంటారు. ఆగస్టు నుంచి అఫ్గానిస్థాన్‌లో పాలన మార్పు జరిగినప్పటి నుంచి ఆ దేశ క్రికెట్ బోర్డుతో మేము క్రమం తప్పకుండా సంప్రదిస్తూనే ఉన్నాం. ఆ దేశంలో క్రికెట్ అభివృద్ధికి మద్దతు తప్పక ఇస్తాం. అయితే ఆ దేశ క్రికెట్ బోర్డులో రాజకీయ జోక్యం ఎలా ఉందనే దానిపై ఎప్పటికప్పుడూ పరిశీలిస్తూనే ఉన్నాం. టీ20 ప్రపంచకప్ తర్వాత దీనిపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది".
- జియోఫ్ అలాడైస్, ఐసీసీ సీఈఓ
అఫ్గానిస్థాన్‌ను తాలిబన్లు ఆక్రమించిన తర్వాత ఆ దేశంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోయాయి. తీవ్ర ఆందోళనల నేపథ్యంలో ఆ దేశ ప్రజలు వలస వెళ్లిపోతున్నారు. ఆ తర్వాత దేశంలో తాలిబన్ల ప్రభుత్వం ఏర్పాటు జరగడం సహా అఫ్గాన్ క్రికెట్ బోర్డు(Afghanistan Cricket Board CEO) సీఈఓగా నసీద్ జర్దాన్ ఖాన్‌ను నియమించడం జరిగింది.
ఇదీ చూడండి.. టీ20 ప్రపంచకప్ విజేతకు ప్రైజ్‌మనీ ఎంతంటే?