Rohith sharma fitness test: గాయం కారణంగా దక్షిణాఫ్రికా పర్యటనకు దూరమైన టీమ్‌ఇండియా వన్డే, టీ20 సారథి రోహిత్ శర్మ.. తాజాగా నిర్వహించిన ఫిట్‌నెస్ పరీక్షల్లో పాస్ అయినట్లు క్రికెట్ వర్గాలు తెలిపాయి. దీంతో అతడు విండీస్‌తో మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్‌కు అందుబాటులో ఉంటాడని వెల్లడించాయి. ఫలితంగా తెల్ల బంతి ఫార్మాట్‌కు పూర్తిస్థాయి నాయకుడిగా ఎంపికైన తర్వాత తొలిసారి జట్టు పగ్గాలను అతడు చేపట్టనున్నాడు. "హిట్‌మ్యాన్ ఫిట్‌నెస్ టెస్ట్ పాస్ అయ్యాడు. వెస్టిండీస్‌తో జరగబోయే సిరీస్‌కు అతడు సారథ్యం వహించనున్నాడు" అని క్రికెట్ వర్గాలకు సంబంధించిన ఓ ప్రతినిధి తెలిపారు.
ఈ వారంలోనే వెస్టిండీస్‌తో సిరీస్‌కు భారత జట్టును సెలక్షన్ కమిటీ ప్రకటించనుంది. ఇదే సమయంలో టెస్టు సారథ్యంపైనా నిర్ణయం తీసుకోవచ్చనే ఊహాగానాలున్నాయి. దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ తర్వాత విరాట్ కోహ్లీ తన కెప్టెన్సీని వదులుకున్నాడు. ఈ నేపథ్యంలో సుదీర్ఘ ఫార్మాట్‌కూ రోహిత్‌నే ఎంపిక చేస్తారని వార్తలు వస్తున్నాయి. వరుసగా వన్డే, టీ20 ప్రపంచకప్‌లు ఉన్న నేపథ్యంలో పనిభారం కాకుండా టెస్టు సారథిగా మరొకరి పేరును కూడా బీసీసీఐ పరిశీలిస్తోందని సమాచారం.
కాగా, ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు, వన్డేల్లో ఆడిన బుమ్రాకు విండీస్‌తో సిరీస్‌లో విశ్రాంతినిస్తారని సదరు ప్రతినిధి పేర్కొన్నారు. పనిభారం నుంచి అతడికి ఉపశమనం కలిగించడానికి ఈ నిర్ణయం తీసుకున్నారని వెల్లడించారు.
ఇదీ చూడండి:
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!