Ind vs Pak World Cup 2023 : ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'డిస్నీ ప్లస్ హాట్‌స్టార్' ఈ ప్రపంచకప్ 2023లో భారత్- పాక్ మ్యాచ్ సందర్భంగా.. 10 సెకన్ల అడ్వర్టైజ్మెంట్కు దాదాపు రూ. 30 లక్షలు వసూల్ చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ టోర్నీలో లైవ్ మ్యాచ్‌లన్నింటినీ ఉచితంగానే స్ట్రీమింగ్ చేస్తామని ఇదివరకే ప్రకటించిన హాట్‌స్టార్.. ఆదాయం పెంచుకునేందుకు ఈ మేరకు యాడ్స్ ధరలు నిర్ణయించినట్లు సమాచారం. కాగా ఈ ప్రపంచకప్ ద్వారానే దాదాపు రూ.1000 కోట్లు సంపాదించాలని టార్గెట్‌గా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. అయితే గత ప్రపంచకప్‌లో ఇదే హాట్‌స్టార్ 10 సెకన్ల అడ్వర్టైజ్మెంట్కు సుమారు రూ. 6-7లక్షలు తీసుకోగా.. తాజాగా ఈ రేటును రూ. 30 లక్షలకు పెంచిందట.
ఐపీఎల్ 2023 హక్కులు కోల్పోయి సమస్యలు ఎదుర్కొంటున్న హాట్‌స్టార్.. ఆ నష్టాన్ని పూడ్చుకునే చర్యలు ప్రారంభించిందనే చెప్పవచ్చు. అయితే కో - ప్రజెంటర్స్ అడ్వర్టైజ్మెంట్ స్లాట్ ఫీజును రూ. 150 కోట్లుగా హాట్‌స్టార్ నిర్ణయించింది. అసోసియేట్ స్పాన్సర్ల నుంచి రూ. 88 కోట్లు వసూల్ చేయనుంది. హాట్‌స్టార్ యాడ్ ధరల ప్రకారం.. 'పవర్డ్ బై' స్పాన్సర్ అవ్వాలనుకున్న కంపెనీ.. రూ. 75 కోట్లు చెల్లించాలి. ఇక అత్యధిక వ్యూవర్షిప్ కలిగిన భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌కు హాట్‌స్టార్ ఎక్కువ మొత్తంలో వసూల్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది. అయితే వరల్డ్ కప్ టోర్నమెంట్.. ఈ బ్రాడ్కాస్టర్లకు ఓ వరంలాగా మారిందనడంలో సందేహం లేదు.
Ind vs Pak Reschedule : మరోవైపు అక్టోబరు 15న జరగాల్సిన ఇండోపాక్ మ్యాచ్ రీషెడ్యూల్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే అదే రోజు గుజరాత్ వ్యాప్తంగా నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా మ్యాచ్ తేదీని మార్చాలని భద్రతా సంస్థలు బీసీసీఐకి సూచించినట్లు ఓ ఆంగ్ల పత్రిక కథనంలో పేర్కొంది. ఈ క్రమంలోనే దీనికి సంబంధించి తుది నిర్ణయం తీసుకుంటామని బీసీసీఐ అధికారులు చెప్పినట్లు తెలిపింది.