India Vs Pakistan ICC World Cup 2023 : ఈ ఏడాది చివర్లో భారత్ వేదికగా జరగనున్న వన్డే ప్రపంచకప్‌లో పాకిస్థాన్ పాల్గొంటుందా.. లేదా అన్న విషయంపై ఇంకా అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. అయితే తాజాగా దీనిపై పాక్ క్రీడల శాఖ మంత్రి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. తటస్థ వేదికల్లో ఆసియా కప్ ఆడేందుకు భారత్ పట్టుబడితే.. ప్రపంచకప్ కోసం భారత్‌కు వెళ్లొద్దని పాక్ జట్టుకు మంత్రి సూచించారు. ఆసియాకప్‌ను హైబ్రిడ్ ఫార్మాట్‌లో ఆడేందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు, ఆసియా క్రికెట్ కౌన్సిల్ఓ అంగీకారానికి వచ్చిన తర్వాత ఆయన ఇలా వ్యాఖ్యలు చేయడం కొత్త ట్విస్ట్‌కు తెర తీశాయి.
అయితే ఆసియా కప్ ఆతిథ్య నిర్వహణ విషయంలో ఎలా అయితే వ్యవహరించారో వరల్డ్‌కప్‌లోనూ అలాంటి విధానాన్నే అనుసరించండి. అలా అయితేనే తమ దేశ క్రికెట్ జట్టును భారత్‌కు పంపిస్తమాని.. లేదంటే పంపించేందుకు సిద్ధంగా లేమని మజారీ వ్యాఖ్యానించారు.
"పీసీబీ నా మంత్రిత్వ శాఖ పరిధిలోనిది. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. భారత్ తాము ఆడబోయే ఆసియా కప్ మ్యాచులను హైబ్రిడ్ మోడల్లో నిర్వహించాలని ఎలా పట్టుబట్టిందో.. ఇప్పుడు మేము కూడా అలాంటి డిమాండ్‌నే తెరపైకి తెస్తున్నాము."
- ఎహ్సాన్ మజారీ, పాక్ క్రీడా శాఖామంత్రి
మొత్తంగా 2023 ఆసియా కప్ కోసం భారత క్రికెట్ జట్టు సరిహద్దును దాటి రాకపోతే వన్డే ప్రపంచకప్ కోసం కూడా తమ జట్టు భారత్‌కు రాదని ఓ ప్రముఖ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాక్ క్రీడా మంత్రి ఈ విషయాన్ని తేల్చిచెప్పారు.
కమిటీలో సభ్యునిగా ఉంటూ..
ODI World cup 2023 : మరోవైపు భారత్‌లో జరిగే వన్డే ప్రపంచకప్‌లో పాక్ క్రికెట్ టీమ్ పాల్గొటుందా లేదా అన్న విషయాన్ని విశ్లేషించి నివేదిక ఇవ్వాలంటూ ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఓ ఉన్నత స్థాయి కమిటీని కూడా ఏర్పాటు చేశారు. అందులో సభ్యునిగా ఎహ్సాన్ మజారీ కూడా ఉన్నారు. అయితే కమిటీ వేసిన మరుసటి రోజే మజారీ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇక త్వరలోనే ఈ కమిటీ ఇచ్చే రిపోర్ట్ ఆధారంగా పాక్ ప్రపంచకప్ పోరులో అడుగుపెడుతుందా లేదా అనేది తెలుస్తుంది.