ICC Bowling Rules : క్రికెట్ మ్యాచ్ అనగానే.. ఫోర్లు, సిక్సర్లు, ఎన్ని శతకాలు ఇలా అన్నీ బ్యాటర్లకు సంబంధించిన విషయాల గురించే ప్రస్తావిస్తారు. బౌలింగ్ విభాగం అనే అంశం ఒకటి ఉందన్న విషయాన్నే గుర్తించరు. కానీ వాస్తవానికి బ్యాటర్ల కంటే బౌలర్లే ఎక్కువ ఫిట్‌గా ఉండాలి. అందులో పేస్ బౌలర్లకైతే మరీను..! వీరు తమ శరీరంలోని శక్తిని బంతికి జోడించి బ్యాటర్లపైకి సంధించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో గాయాలబారిన పడే ప్రమాదం లేకపోలేదు. ఫిట్‌నెస్‌లో ఏమాత్రం తేడా వచ్చినా ఎంతటి బౌలరైనా జట్టుకు దూరం కావాల్సిందే. జస్ప్రీత్ బుమ్రానే దీనికి సరైన ఉదాహరణ.
ప్రస్తుతం ఉన్న ఆటగాళ్లకు సైతం బౌలింగ్ పట్ల సదభిప్రాయం లేకపోవటం బాధాకరం. ఒక బౌలర్ తన వారసుడిని బౌలర్‌గా చూడాలనుకోవటం లేదు అనటం బౌలర్ల పరిస్థితికి అద్దం పడుతోంది. 'నా కుమారుడు బౌలర్ అవటం నాకు ఇష్టం లేదు. ఎప్పుడైనా అతడు బంతిని ముట్టుకుంటే చేతి మీద కొడతా. కారణం అతడు బ్యాటర్‌గా ఎదగాలనేది నా కల. అందుకోసం రోజూ అతడికి శిక్షణ ఇప్పిస్తున్నా. నెట్స్‌లో స్వయంగా నేనే బౌలింగ్ చేస్తా. ఒక బౌలర్‌గా ఐపీఎల్ ఆడుతున్న నాకు 50 లక్షలు వస్తున్నాయి. అదే నా కుమారుడు ఒక మంచి బ్యాటర్‌గా మరితే రానున్న పది సంవత్సరాలలో 20 కోట్ల దాకా ఇస్తారు. నా కుమారుడి కోసం 20 కోట్లు పక్కన పెట్టుకోవాలని ముంబయి ఇండియన్స్ యాజమాన్యానికి చెప్పా' అని భారత స్పిన్నర్ పియూష్ చావ్లా అన్నాడు.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
ప్రస్తుతం పరిమిత ఓవర్ల క్రికెట్‌లో బౌలర్ల పరిస్థితి పూర్తిగా మారిపోయింది. తరచూ మారుతున్న క్రీడా నిబంధనలు కూడా బౌలింగ్‌ను ఓ కఠినమైన ప్రక్రియగా మార్చేస్తున్నాయి. ఒకప్పుడు వెస్టిండీస్ పేస్ దళం బౌన్సర్లతో బ్యాటర్లను బెంబేలెత్తించేది. కానీ, ఇప్పుడు అలా లేదు. గంటకు 150 కి.మీ.తో బంతిని విసిరినా.. బ్యాటర్లు అలవోకగా బౌండరీలు బాదేస్తున్నారు. దీనికి తోడు క్రికెట్ ఫార్మాట్లలో ఓవర్లను కుదించటం బౌలర్లకు శాపంగా మారింది. టీ10, టీ20 మ్యాచ్‌ల్లో అయితే బౌలర్లు సంధించే బంతులను ఊచకోత కోయడం బ్యాటర్లకు అలవాటుగా మారింది. భారత్ వన్డే ప్రపంచ కప్ గెలిచిన 2011 సంవత్సరం నాటికి 6,333 వన్డే మ్యాచుల్లో 393 సార్లు 300+ స్కోర్లు నమోదు అయ్యాయి. కానీ, 2011 తర్వాత నుంచి 2020 వరకు 1,606 మ్యాచుల్లో ఏకంగా 257 సార్లు స్కోర్‌బోర్డ్ 300 దాటేసిందంటే బ్యాటర్ల విధ్వంసాన్ని అర్థం చేసుకోవచ్చు. ఇక టీ20 ఫార్మాట్ బాగా ఫేమస్ అయ్యాక.. వన్డేల్లో 300+ స్కోర్లు సర్వ సాధారణమైపోయింది. ఇది బ్యాటర్లు.. బౌలర్లపై ఏ స్థాయిలో విరుచుకుపడుతున్నారో తెలియజేస్తోంది. దీంతోపాటు కొన్ని కొత్త నిబంధనలు బౌలర్లకు సమస్యగా మారాయి. ఈ నిబంధనలు..
ఫీల్డింగ్ నిబంధనలు.. ఫీల్డింగ్ నిబంధనలు కేవలం బ్యాటర్‌కు అనుకూలంగానే ఉంటున్నాయనే విమర్శ ఎప్పటి నుంచో ఉంది. వన్డేల్లో తొలి 10 ఓవర్లలో, టీ20 ల్లో అయితే మొదటి 6 ఓవర్లు 30యార్డ్స్ సర్కిల్ బయట కేవలం ఇద్దరు ఫీల్డర్లే ఉంటారు. స్పిన్నర్లకు ఇది చాలా ఇబ్బందికరంగా మారింది. తమ బౌలింగ్ వ్యూహాలకు అనుగుణంగా ఫీల్డింగ్‌ను పెట్టుకొనే అవకాశం లేదు. దీంతో స్కోర్‌బోర్డు 300 దాటేస్తోంది.
ఫ్రీహిట్‌తో సమస్య.. నోబాల్‌కు అదనంగా ఒక ఫ్రీహిట్ వేయాల్సి ఉంటుంది. ఈ రూల్ బౌలర్లకు నరకప్రాయంగా మారింది. ఈ ఫ్రీహిట్ బంతికి రనౌట్ మినహా బ్యాటర్లను ఔటు చేయడానికి ఏ మార్గమూ లేదు. చాలా సార్లు ఈ ఫ్రీహిట్లు మ్యాచ్ ఫలితాలను మార్చేశాయి. ఇలాంటి నిబంధనలు బౌలర్ల ఆత్మవిశ్వాసం దెబ్బతిస్తున్నాయి. ప్రస్తుత ఐపీఎల్ మ్యాచ్‌లో కూడా ఈ నోబాల్ కారణంగానే హైదరాబాద్, రాజస్థాన్ పై చివరి బంతికి విజయం దక్కించుకుంది.
బౌన్సర్లపై ఆంక్షలు.. ఒక ఓవర్‌లో ఆరు బంతులను సిక్స్‌లు కొట్టేందుకు బ్యాటర్‌కు అవకాశం ఉంది. కానీ బౌలర్‌కు మాత్రం ఆరు బౌన్సర్లు వేసే అవకాశం లేదు. కేవలం ఒక బౌన్సర్‌కే అనుమతి ఉంది. ఆ తర్వాత కూడా బౌన్సర్ విసిరితే.. బ్యాటింగ్ చేసే జట్టుకు అదనంగా 1 పరుగు ఇచ్చి.. నోబాల్‌గా ప్రకటిస్తారు.
ఫైన్‌లెగ్ నిబంధనలతో కళ్లెం.. బాడీలైన్ బౌలింగ్‌ను నిరోధించేందుకు ఫైన్‌లెగ్‌లో ఫీల్డర్ల సంఖ్యను కుదించారు. ఫైన్‌లెగ్‌లో ఒక్కఫీల్డర్‌కు మాత్రమే అవకాశం ఉంది. దీంతో బౌలర్ విసిరిన బంతి ఏమాత్రం లెగ్‌సైడ్ వైడ్‌గా మారినా. బ్యాటర్ దానిని కొడితే దాదాపుగా బంతి బౌండరీ లైన్ దాటేస్తుంది.
అన్నింటికి మించి ఆకర్షణీయమైన సంపాదన..
క్రికెట్‌లో బ్యాటర్లు మరింత ఆకర్షణీయంగా మారారు. భారత క్రీడల్లో గతేడాది 505 ఎండార్స్‌మెంట్లు (ప్రకటనలు) జరిగితే వాటిల్లో 381 డీల్స్ క్రికెటర్లకే దక్కాయి. క్రికెటర్లకు రూ.640 కోట్లు దక్కగా.. మిగిలిన క్రీడలకు రూ. 109 కోట్లు లభించాయి. టీమ్ ఇండియా మాజీలు అనిల్ కుంబ్లే, సచిన్‌లకు వాణిజ్య ప్రకటనల ఆదాయం చాలా ఎక్కువ. ప్రస్తుతం ఎండార్స్‌మెంట్లలో ప్రస్తుత టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ విరాట్, ధోని హవా నడుస్తోంది. వీరు ముగ్గురు.. ఒక్కొక్కరూ 30 బ్రాండ్లకు చొప్పున ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాగా ప్రస్తుత భారత బౌలర్లలో బుమ్రా ఒక్కడే ఎండార్స్‌మెంట్లలో ఉన్నాడు.