Mens Cricket Future Tours Programme(FTP) అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) పురుషుల క్రికెట్‌కు సంబంధించిన భవిష్యత్ పర్యటన ప్రణాళికను(ఎఫ్‌టీపీ) బుధవారం విడుదల చేసింది. 2023 నుంచి 2027 కాలానికిగాను పూర్తి షెడ్యూల్‌ను ఐసీసీ ప్రకటించింది. ఇందులో ద్వైపాక్షిక సిరీస్‌లతో పాటు రెండు ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్‌లు, రెండు టీ20 ప్రపంచకప్‌లు, రెండు వన్డే ప్రపంచకప్‌లు, ఛాంపియన్స్ ట్రోఫీ ఉన్నాయి. అయితే.. పాక్‌తో భారత ద్వైపాక్షిక సిరీస్‌లకు ఇందులో చోటు కల్పించలేదు.
2019-23 ఫ్యూచర్ టూర్ ప్రోగ్రామ్ కన్నా తాజా షెడ్యూల్‌లో మూడు ఫార్మాట్‌లోనూ మ్యాచ్‌ల సంఖ్య పెరిగింది. ప్రస్తుత షెడ్యూల్‌లో మొత్తం 694 మ్యాచ్‌లు కాగా 2023-27 ఎఫ్‌టీపీలో 777కి పైగా మ్యాచ్‌లు ఉన్నాయి. వాటిలో 173 టెస్టులు, 281 వన్డేలు, 323 టీ20 మ్యాచ్‌లు ఉన్నాయి. వన్డే ఫార్మాట్ ప్రాభవం కోల్పోతుందని.. మ్యాచ్‌లు తగ్గించాలని పలువురు చెబుతున్న వేళ.. ఐసీసీ కుదించకపోవడం విశేషం.
ఆగస్టు 18, 2022 నుంచి ఫిబ్రవరి 2027 కాలంలో భారత్ 44 టెస్టులు, 63 వన్డేలు,76 టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్(2023-25, 2025-27)లో భాగంగా రెండు ఎడిషన్‌లోనూ ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో టీమ్‌ఇండియా తలపడనుంది. 1992 తర్వాత తొలిసారి టీమ్‌ఇండియా-ఆసీస్ జట్ల మధ్య ఐదు టెస్టుల సిరీస్ జరగనుండటం విశేషం. ఇప్పటికే ఐదు టెస్టులతో కూడిన యాషెస్ సిరీస్‌లో ఆసీస్-ఇంగ్లాండ్ టీమ్‌లు తలపడుతున్న విషయం తెలిసిందే.
ఇదీ చూడండి: సూర్యకుమార్‌ను ఏబీడీతో పోల్చడం తొందరపాటే