ఎంఎస్ ధోనీ, రాబిన్ ఊతప్ప.. ఈ ఇద్దరు టీమ్ఇండియా మాజీ క్రికెటర్లు చాలా కాలంగా డ్రెస్సింగ్ రూమ్‌ను పంచుకున్నారు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి ఐపీఎల్ వరకు ఇద్దరూ కలిసే ఉన్నారు. వీరిద్దరూ చాలా క్లోజ్‌గా కనిపిస్తుంటారు. గత ఐపీఎల్ సీజన్ వరకు ఇద్దరూ చెన్నై సూపర్ కింగ్స్‌లో కలిసి ఉన్నారు. ఇటువంటి పరిస్థితిలో ఈ ఇద్దరు ఆటగాళ్లకు ఒకరి అలవాట్లు ఒకరికి బాగా తెలుసు. అయితే తాజాగా మిస్టర్ కూల్‌కు ఉన్న వెరైటీ ఆహారపు అలవాట్లను ఊతప్ప వెల్లడించాడు. ఫుడ్ విషయంలో.. ధోనీ కాస్త వెరైటీగా ఉంటాడని తెలిపాడు. మహీ బటర్ చికెన్ తింటాడని.. కానీ అందులో ఉన్న చికెన్ మాత్రం తినడని చెప్పాడు. ఇంకా పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. అవి ఊతప్ప మాటల్లోనే..
బటర్ చికెన్‌లో నో చికెన్!
"మేం ఎప్పుడూ కలిసి తినేవాళ్లం. మాకు ఒక గ్రూప్ ఉంది. అందులో సురేశ్ రైనా, ఇర్ఫాన్ పఠాన్, ఆర్‌పీ సింగ్, పీయూష్ చావ్లా, మునాఫ్ పటేల్, ఎంఎస్ ధోనీ, నేను ఉన్నాం. మేం దాల్ మఖానీ, బటర్ చికెన్, జీరా ఆలూ, క్యాబేజీ, రోటీస్ ఆర్డర్ చేసేవాళ్లం. ఇక్కడి ఆహారం విషయంలో ధోనీ భిన్నంగా ఉంటాడు. అతడు బటర్ చికెన్ తింటాడు. కానీ చికెన్ లేకుండా తింటాడు. గ్రేవీతో రోటీ మాత్రమే తింటాడు. మరోసారి చికెన్ తిన్నప్పుడు మాత్రం రోటీ తినడు."
మహీ అని పిలిచినా చాలు!
"నేను మొదటిసారి సీఎస్కేలో చేరినప్పుడు.. జట్టులోని ప్రతి ఒక్కరూ అతడిని మహీ భాయ్ అని పిలవడం నేను చూశాను. నేను కూడా ధోనీ దగ్గరకు వెళ్లి మహీ భాయ్ అని పిలవాలా అని అడిగాను. అందుకు ధోనీ నిరాకరించాడు. నువ్వు ఎలా పిలవాలి అనుకుంటే అలా పిలవొచ్చు అని అన్నాడు. మహీ అని పిలిచినా చాలు అని చెప్పాడు."
అప్పుడే చెప్పేశాడు!
"ధోనీ చాలా ఓపెన్ పర్సన్. మీకు బాధ కలిగించినా.. నిజం మాట్లాడేందుకు వెనుకాడడు. సీఎస్కే వేలం అగ్రిమెంట్లో సంతకం చేసే సమయంలో నన్ను పిలిచాడు. సీజన్‌కు ఇంకా చాలా సమయం ఉంది. మీకు ఆడే అవకాశం వస్తుందో లేదో కచ్చితంగా చెప్పలేను అని అన్నాడు. కానీ ఇప్పటి వరకు ఐపీఎల్‌లో 13 ఏళ్లు సక్సెస్‌ఫుల్‌గా గడిపాను. టీమ్ఇండియాతో చెన్నై జట్టుకు ధోనీ అద్భుతమైన విజయాల్ని అందించాడు. అతడిలో చాలా టాలెంట్ ఉంది. ఒక మ్యాచ్ ఓడినా.. గెలిచినా ఆ ఫలితాన్ని తనపైనే వేసుకుంటాడు. అందుకే అతడు సక్సెస్ఫుల్ కెప్టెన్‌గా మారాడు."