టీమ్ఇండియా క్రికెటర్ రోహిత్ శర్మ తన రోల్ మోడల్ అని పాకిస్థాన్ యువ క్రికెటర్ హైదర్ అలీ స్పష్టం చేశాడు. జట్టుకు ఓపెనర్‌గా రోహిత్ చేసే ప్రదర్శన అద్భుతమని కొనియాడాడు. ఇరుదేశాల మధ్య దశాబ్దాలుగా వైరం కొనసాగుతోంది. ఈ మధ్యకాలంలో రాజకీయ పరంగా పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారుతున్నప్పటికీ.. ఇటువంటి ప్రశంసలు రావడం గమనార్హం.
"టెస్టు, వన్డే, టీ20 ఇలా ఏ ఫార్మాట్ అయినా సరే.. రోహిత్ ఒక ఆలోచనతో వచ్చి ప్రత్యర్థి జట్టుపై విరుచుకుపడతాడు. నేను కూడా పాక్ జట్టుకు ఓపెనర్‌గా అటువంటి ఆరంభాన్నే ఇవ్వాలనుకుంటున్నా."
-హైదర్ అలీ, పాక్ క్రికెటర్
రాబోయే ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లనున్న 29 మంది సభ్యుల పాకిస్థాన్ జట్టులో హైదర్ కూడా ఉన్నాడు. ముంబయిలో 2008లో జరిగిన ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్‌లు నిలిచిపోయాయి. అయితే దాయాది జట్టు అప్పుడప్పుడు బహుళ జట్టు టోర్నీల్లో భారత్‌తో తలపడుతుంటుంది.