అభిమానుల కోలాహలం, కేరింతలు, ఈలలు, గోల మధ్య ఐపీఎల్ జరుగుతుంటే ఆ కిక్కే వేరు. ఆటగాళ్లకు కూడా ప్రేక్షకుల మధ్య ఆడుతుంటే అంతే మజాగా ఉంటుంది. అలుపు లేకుండా బాదడం.. టెక్నిక్‌తో బౌలింగ్ వేసి వికెట్లు పడగొడ్డటం లాంటివి కనిపిస్తుంటాయి. ఈ సీజన్ మాత్రం కరోనా ప్రభావంతో.. ఉక్కబోత ప్రాంతమైన యూఏఈలో, ప్రేక్షకులు లేని స్టేడియాల్లో జరగనుంది. ఎగిరి గంతులేస్తూ హంగామా చేసే ఫ్యాన్స్ ఉండరు. నియమాలు కూడా కాస్త ఎక్కువే. ఆటగాళ్లకు వీరు లేకుండా ఆడటం కొత్తే.
మరి ఈ ప్రభావం సదరు క్రికెటర్లపై ఉండనుందా? ఇంతకముందులా ఉత్సాహంతో ఆడతారా? బ్యాట్స్‌మన్, బౌలర్ల మధ్య ఆధిపత్య పోరు రసవత్తరంగా సాగుతుందా? లాంటి ప్రశ్నలు క్రీడాభిమానల్లో మదిలో రేకెత్తుతున్నాయి. పలువురు క్రికెటర్లు ఇంతకముందులా జోరు చూపించగలరా?
విరాట్ కోహ్లీ
టీమ్ఇండియా సారథి విరాట్ కోహ్లీ.. ఐపీఎల్ ఆరంభం నుంచి బెంగళూరుకు సారథ్యం వహిస్తున్నాడు. ప్రత్యర్థి లేదా సహచర ఆటగాళ్లు కవ్వింపు చర్యలకు పాల్పడితే మైదానంలో ఎలా రెచ్చిపోతాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అభిమానుల కేరింతలు, ఈలలకు మరింతగా విజృంభిస్తాడు. అలాంటిది ఈ సారి ప్రేక్షకులు లేని స్టేడియంలో ఎలా ఆడతాడనేది ఆసక్తికరం.
ఏబీ డివిలియర్స్
దక్షిణాఫ్రికా మాజీ స్టార్ క్రికెటర్ ఏబీ డివిలియర్స్(ఆర్సీబీ).. క్రికెట్‌తో పాటు గాయకుడు, స్విమ్మర్, జాతీయ స్థాయి రగ్బీ ఆటగాడు. తన ప్రశాంత స్వభావంతో అన్ని రంగాల్లోనూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. 2018లో రిటైర్మెంట్ ప్రకటించినా సరే మైదానంలో దిగితే బౌలర్లపై చెలరేగిపోతాడు. ఇతడు బంతిని బాదిన ప్రతిసారి స్టాండ్స్‌లో అభిమానులు ఊగిపోతుంటారు. మరి ఈసారి వాళ్లు లేని సవాల్‌ను ఏబీ ఎలా స్వీకరిస్తాడో చూడాలి.
క్రిస్‌గేల్
వెస్డిండీస్ విధ్వంసకర బ్యాట్స్‌మన్ క్రిస్‌గేల్ (కింగ్స్ ఎలెవన్ పంజాబ్) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాల్‌ను కొడితే అది స్టాండ్స్‌లో పడటం పక్కా. ఇతడి ఆట కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తుంటారు. బరిలో దిగాడంటే ఫ్యాన్స్ గోలతో మైదానం దద్దిరిల్లిపోతుంటుంది. అలాంటిది ఈసారి ఎలా ఆడతాడో చూడాలి.
డ్వేన్ బ్రావో
డ్రేన్ బ్రావో.. గత కొన్ని సీజన్ల నుంచి చెన్నై సూపర్‌కింగ్స్ విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. అభిమానుల చూస్తే చాలు ఆకాశమే హద్దుగా చెలరేగిపోతుంటాడు. మరి ఇప్పుడు వీక్షకులు ఉండరు. దీంతో అతడి జోరు తగ్గుతుందా? అలానే కొనసాగిస్తాడా అనేది చూడాలి.
ఇమ్రాన్ తాహిర్
వికెట్ తీస్తే చాలు ఆ ఆనందంతో మైదానంమంతా పరుగెత్తుతాడు ఇమ్రాన్ తాహిర్. అభిమానుల అరుపులను, కేరింతలను బాగా ఆస్వాదిస్తుంటాడు. మరి ఈసారి ఆ అవకాశం లేదు. ఏం చేస్తాడో చూడాలి.
ఇదీ చూడండి కనురెప్ప వేయకుండా ధోనీ సరేనన్నాడు: ఉతప్ప