ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో టీమ్ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ చెరగని ముద్ర వేశాడు. 12 ఎడిషన్లలో పదిసార్లు చెన్నై సూపర్ కింగ్స్‌కు కెప్టెన్సీ వహించాడు. ఝార్ఖండ్‌కు చెందిన ధోనీని.. తమిళులు 'తలైవా' అని పిలుచుకునేంతగా సీఎస్కేతో మమేకం అయ్యాడు.
తొలి నుంచి కెప్టెన్ ధోనీనే
2007లో తొలిసారి నిర్వహించిన టీ20 ప్రపంచకప్‌ను భారత్ కైవసం చేసుకుంది. మరుసటి ఏడాదే భారత్‌లో ఐపీఎల్ ప్రారంభమైంది. తొలి సీజన్ లో ధోనీని 1.5 మిలియన్ డాలర్లు వెచ్చించి కొనుగోలు చేసింది చెన్నైసూపర్ కింగ్స్. అప్పటినుంచి అతడ్నే కెప్టెన్‌గా కొనసాగిస్తోంది.
అన్ని సీజన్లలోనూ చెన్నై ప్లేఆఫ్స్‌కు అర్హత
2008 ఫైనల్‌లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓడి రన్నరప్‌తో సరిపెట్టుకుంది చెన్నై. సీఎస్కేను 2009లో ప్లేఆఫ్స్‌కు చేర్చిన ధోనీ.. 2010లో ఛాంపియన్‌గా నిలబెట్టాడు. 2011లో మరోసారి టైటిల్ నిలబెట్టుకుంది చెన్నై. ఆ తర్వాత జరిగిన 2012, 2013, 2015లో తన కెప్టెన్సీతో ఫైనల్‌కు చేర్చాడు.
తిరిగొచ్చాడు.. విజేతగా నిలబెట్టాడు
2015 సీజన్ తర్వాత మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణల నేపథ‌్యంలో చెన్నై ఫ్రాంచైజీపై రెండేళ్లు నిషేధం పడింది. ఆ సమయంలో కొత్తగా ఏర్పడిన రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్‌కు సారథ్యం వహించాడు మహీ.
తర్వాత చెన్నై ఫ్రాంచైజీలోకి తిరిగి అడుగుపెట్టాడు. వచ్చి రాగానే (2018లో) ఐపీఎల్ ట్రోఫీని మూడోసారి ముద్దాడాడు. తర్వాతి సీజన్లో సీఎస్కేను రన్నరప్‌గా నిలిపాడు. ఛాంపియన్స్లీగ్లో ఇదే జట్టును రెండుసార్లు ఛాంపియన్‌గానూ నిలబెట్టాడు.
అత్యంత సమర్థమంతమైన కెప్టెన్ ధోనీనే
ఐపీఎల్‌లో మొత్తంగా 190 మ్యాచ్‌లు ఆడాడు ధోనీ. 42 సగటుతో 4,432 పరుగులు చేశాడు. 170 ఇన్నింగ్స్‌ల్లో 65 సార్లు నాటౌట్‌గా నిలిచాడు. 23 అర్ధసెంచరీలు చేశాడు. అత్యధిక వ్యక్తిగత స్కోరు 84.
ఇప్పటివరకు 297 ఫోర్లు, 209 సిక్స్‌లు బాదాడు. 98 క్యాచ్‌లు, 38 స్టంపింగ్‌లు చేశాడు. 12 ఎడిషన్లలో నాలుగు సార్లు 400కి పైగా పరుగులు దాటాడు. ఈ టోర్నీలో అత్యంత సమర్థమైన కెప్టెన్‌గా నిలిచాడు.