Pujara Century: గంటల తరబడి క్రీజులో పాతుకుపోయే టెస్టు స్పెషలిస్ట్, భారత బ్యాటర్ ఛెతేశ్వర్ పుజారా విధ్వంసక ఇన్నింగ్స్ ఆడాడు. నెమ్మదైన ఆటను వదిలి చెలరేగిపోయాడు. ఇంగ్లాండ్‌లో జరుగుతున్న రాయల్ లండన్ కప్ వన్డే ఛాంపియన్‌షిప్‌లో ససెక్స్ జట్టుకు ఆడుతున్న పుజారా.. వరుసగా రెండో సెంచరీ సాధించాడు. ఇవి రెండు రోజుల వ్యవధిలోనే రావడం విశేషం.
వార్విక్‌షైర్‌పై శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో 79 బంతుల్లో 107 పరుగులు చేసిన పుజారా.. ఇప్పుడు సర్రేపై 131 బంతుల్లో 174 రన్స్ బాదాడు. ఇది లిస్ట్ ఏ క్రికెట్లో అతడి కెరీర్ బెస్ట్ స్కోర్. 9 పరుగులకే 2 కీలక వికెట్లు కోల్పోయి జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు బ్యాటింగ్‌కు వచ్చిన పుజారా.. మంచి స్కోరు అందించాడు. టామ్ క్లార్క్‌తో కలిసి మూడో వికెట్‌కు 205 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశాడు. 103 బంతుల్లో శతకం సాధించిన భారత బ్యాటర్.. ఆ తర్వాత రెచ్చిపోయి ఆడాడు. 28 బంతుల్లోనే తర్వాతి 74 పరుగులు చేయడం విశేషం.
తన ఇన్నింగ్స్‌లో 20 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి. పుజారా బాదుడుతో ససెక్స్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 378 పరుగులు చేసింది.
శుక్రవారం వార్విక్‌షైర్‌పై 311 పరుగుల ఛేదనలోనూ ఈ కుడి చేతి వాటం బ్యాటర్ మెరుపు శతకం బాదాడు. చెలరేగి ఆడిన అతడు 79 బంతుల్లోనే 107 పరుగులు చేశాడు ఇందులో ఏడు ఫోర్లు, రెండు సిక్స్‌లు ఉన్నాయి. ఒక ఓవర్లో 22 పరుగులు రాబట్టడం విశేషం. అయితే ఈ మ్యాచ్‌లో పుజారా జట్టు ఓడిపోయింది. 49వ ఓవర్ తొలి బంతికి పుజారా ఔట్ కావడంతో.. చివరికి ససెక్స్ 7 వికెట్లకు 306 పరుగులే చేసింది. వార్విక్షైర్ తరఫున ఆడిన భారత ఆఫ్ స్పిన్నర్ కృనాల్ పాండ్య (3/51) విజయంలో కీలకపాత్ర పోషించాడు. అంతకుముందు వార్విక్షైర్ ఇన్నింగ్స్‌లో రాబర్ట్ యాట్స్ (114) సెంచరీ చేయగా.. విల్ రోడ్స్ (76), బర్జెస్ (58) రాణించి జట్టుకు మెరుగైన స్కోరు అందించారు.
ఇవీ చదవండి: కొద్దిరోజుల్లో ఆసియా కప్ షురూ, ఈ విషయాల గురించి తెలుసా