Asia Cup ODI Format : ప్రతిష్టాత్మక ఆసియాకప్ 2023 టోర్నీకి సర్వం సిద్ధమైంది. మరో 14 రోజుల్లో ప్రారంభం కానున్న మెగా టోర్నీ కోసం ఇప్పటి నుంచే ప్లేయర్స్ కసరత్తులు మొదలెట్టారు. ప్రత్యర్థులను చిత్తు చేసేందుకు మైదానంలో చెమటోడుస్తున్నారు. ఇక ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 17 వరకు జరగనున్న ఈ టోర్నీకి శ్రీలంక, పాకిస్థాన్ సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి.
కాగా గతేడాది యూఏఈ వేదికగా జరిగిన ఆసియాకప్ టోర్నీలో శ్రీలంక విజేతగా నిలిచింది. టీ20 ఫార్మాట్‌లో సాగిన ఈ టోర్నీ ఫైనల్స్‌లో ప్రత్యర్థి పాకిస్థాన్‌ను ఓడించింది. అయితే ఈ టోర్నీలో టీమ్ఇండియా ఫైనల్స్ చేరకుండానే వెనుదిరిగింది. కానీ గతేడాది టీ20 ఫార్మాట్‌లో జరిగిన ఈ మెగా టోర్నీ.. ఈ సారి వన్డే ఫార్మాట్‌లో ఎందుకు జరుగుతుంది అనేది అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న. అయితే ఎందుకు ఇలా జరుగుతోందంటే..
1984లో మొదలైన ఆసియాకప్.. ఇప్పటి వరకు 17 ఎడిషన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది.అయితే 1984 నుంచి 2014 వరకు వన్డే ఫార్మాట్‌లో జరిగిన ఈ ఆసియాకప్ టోర్నీ.. 2016లో తొలిసారిగా టీ20 ఫార్మాట్‌లో జరిగింది. ఆ తర్వాత 2018లో వన్డే ఫార్మాట్‌లో జరిగింది. కొవిడ్ కారణంగా 2020లో జరగాల్సిన ఓ టోర్నీ.. 2022కు వాయిదాపడగా.. ఈ మ్యాచ్‌లను కూడా టీ20 ఫార్మాట్‌లోనే నిర్వహించారు.
Asia Cup 2023 Format : తాజాగా ఇప్పుడు మరోసారి వన్డే ఫార్మాట్‌లో నిర్వహించేందుకు సిద్ధమౌతున్నారు. అయితే ఇలా ప్రతీ సీజన్‌కు ఫార్మాట్లను మార్చడం వెనుక ఉన్న అసలు కారణం ఏంటి అని తెలుసుకునేందుకు ఫ్యాన్స్ ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే ఐసీసీ మెగా టోర్నీల నేపథ్యంలోనే ఆసియాకప్‌ను వన్డే, టీ20 ఫార్మాట్‌లలో నిర్వహిస్తున్నారు. అంతే కాకుండా ఈ ఏడాది భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్ జరగనున్నందున.. ఆసియాకప్‌ను వన్డే ఫార్మాట్‌లో నిర్వహించనున్నారట.
అయితే ఈ ఫార్మాట్‌ల మార్పుపై 2015లోనే తుది నిర్ణయం తీసుకున్నారు. ఐసీసీ మెగా టోర్నీలకు అనుగుణంగా ఆసియా కప్ నిర్వహించాలంటూ అప్పటి ఆసియా క్రికెట్ కౌన్సిల్(ఏసీసీ) ఓ నిర్ణయానికి వచ్చింది. 2016లో భారత్ వేదికగా టీ20 ప్రపంచకప్ జరగడం వల్ల.. ఆ టోర్నీకి ముందు బంగ్లాదేశ్ వేదికగా ఆసియాకప్‌ను తొలిసారి టీ20 ఫార్మాట్‌లో నిర్వహించారు.
Asia Cup 2023 Winners : ఈ టోర్నీలో మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని టీమ్ఇండియా జట్టు విజేతగా నిలిచింది. 2019 వన్డే ప్రపంచకప్ ముందు జరిగిన 2018 ఆసియాకప్‌ను మళ్లీ వన్డే ఫార్మాట్‌లోనే నిర్వహించారు. రోహిత్ శర్మ సారథ్యంలో ఆడిన ఈ టోర్నీలో టీమిండియా మరోసారి టైటిల్ గెలిచింది.
ఆస్ట్రేలియా వేదికగా టీ20 ప్రపంచకప్ 2022 నేపథ్యంలో ఆసియాకప్ 2022ని మళ్లీ టీ20 ఫార్మాట్‌లో జరిపారు. ఇప్పుడు వన్డే ప్రపంచకప్ నేపథ్యంలో వన్డే ఫార్మాట్‌లో నిర్వహిస్తున్నారు. భవిష్యత్తులోనూ ఐసీసీ మెగా టోర్నీలకు అనుగుణంగా ఆసియాకప్ ఫార్మాట్‌ను నిర్ణయించనున్నారు.