టీ20 ప్రపంచకప్ ముంగిట మణికట్టు స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఫిట్‌నెస్(Varun Chakravarthy fitness) బీసీసీఐకి తలనొప్పిగా మారింది. ఈ టోర్నీలో కీలకపాత్ర పోషించగలడని భావిస్తున్న ఈ మిస్టరీ స్పిన్నర్(Varun Chakravarthy News) మోకాళ్లు చాలా బలహీనంగా ఉండడం బోర్డును కలవరపరుస్తోంది. మంచి స్పిన్ నైపుణ్యం ఉన్నా, మోకాళ్లు ఫిట్‌గా లేకపోవడం వల్ల అతడు నొప్పితో బాధపడుతున్నాడు.
"వరుణ్ మోకాళ్లు మంచి స్థితిలో లేవు. తరుచూ నొప్పితో బాధపడుతున్నాడు. అతడు టీ20 ప్రపంచకప్‌లో ఆడేది కష్టమే. ఎందుకంటే తుది జట్టులో వరుణ్‌ను ఆడించే సాహసం టీమ్ మేనేజ్‌మెంట్ చేయకపోవచ్చు. టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో ముందు అతడి మోకాలి నొప్పిని తగ్గించే విషయంపై దృష్టి సారించాం" అని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ఈ ఐపీఎల్‌లో మంచి ఫామ్‌లో ఉన్న చక్రవర్తి ఇప్పటిదాకా 13 మ్యాచ్‌లు ఆడి 6.73 ఎకానమీతో 15 వికెట్లు పడగొట్టాడు. దాదాపు అన్ని జట్లు అతడిని ఎదుర్కోవడంలో ఇబ్బంది పడ్డాయి.
ఈ నైపుణ్యం వల్లే టీ20 ప్రపంచకప్‌లో(T20 World Cup) వరుణ్ కీలకమవుతాడని బోర్డు భావిస్తోంది. "వరుణ్ ఫిట్‌నెస్‌ను మెరుగుపరిచే దిశగా కోల్‌కతా సహాయక సిబ్బంది జాగ్రత్తగా చూసుకుంటున్నారు. అతడి ఫిట్‌నెస్ మేనేజ్‌మెంట్‌కు ఓ ప్రత్యేక ఛార్ట్ రూపొందించారు. అవసరమైనప్పుడు నొప్పి నివారణ ఇంజక్షన్లు ఇస్తున్నారు. బౌలింగ్ చేయని సమయంలో, మైదానంలో ఉన్నప్పుడు అతడు చాలా నొప్పితో ఇబ్బందిపడుతున్నాడు. అందుకే డైవ్ చేయద్దని అతడికి సూచించాం" అని కోల్‌కతా జట్టు వర్గాలు వెల్లడించాయి.
ఇదీ చదవండి:'ఆ రెండు రోజులు నిద్ర పట్టలేదు'