ఆస్టేలియా స్టార్ ప్లేయర్, టీ20 కెప్టెన్ ఆరోన్ ఫించ్ తన ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్ ఇచ్చాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు అతడు రిటైర్మెంట్ ప్రకటించాడు. 2020లో ఆస్ట్రేలియా తొలి టీ20 ప్రపంచకప్ ముద్దాడటంలో ఫించ్ కీలక పాత్ర పోషించాడు. ఆ టోర్నీలో ఆస్ట్రేలియా జట్టుకు సారథ్యం వహించాడు. 2024 టీ20 ప్రపంచకప్ వరకు తాను ఆడలేనని గ్రహించినట్లు చెప్పుకొచ్చాడు. అందుకే రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు తెలిపాడు. మంగళవారం ఉదయం ఈ విషయాన్ని ఎంసీజీ మైదానంలో వెల్లడించాడు.
"నేను 2024 టీ20 ప్రపంచకప్‌లో ఆడలేనని తెలుసు. అలాంటి పరిస్థితుల్లో రిటైర్ కావడానికంటే ఇప్పుడే రిటైరవ్వడం సరైన సమయమని భావించాను. తద్వారా జట్టుకు భవిష్యత్ నాయకుడిని తయారుచేసుకోవడానికి సమయం లభిస్తుంది. నాకు ఎల్లవేళలా మద్దతుగా నిలిచినందుకు ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డుకు, సహచరులకు, సహాయ సిబ్బందికి, నా కుటుంబానికి కృతజ్ఞతలు. అలాగే అభిమానులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. 2020లో టీ20 ప్రపంచకప్, 2015 వన్డే ప్రపంచకప్ గెలవడం నా కెరీర్ లో అద్భుతమైన జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి" అని ఫించ్ అన్నాడు.
ఆరోన్ ఓపెనర్‌గా బరిలోకి దిగితే ఇక అంతే తగ్గేదే లే అంటూ బ్యాటింగ్ చేస్తాడు. అలా మొత్తం 146 వన్డేల్లో 5406 పరుగులు చేసి రికార్డు సృష్టించాడు. అందులో 17 సెంచరీలు, 30 అర్ధసెంచరీలు ఉన్నాయి. 103 టీ20లు ఆడి 2 సెంచరీలు, 19 అర్ధసెంచరీలు సహా 3120 పరుగులు సాధించాడు. 5 టెస్ట్ మ్యాచుల్లో 278 పరుగులు చేశాడు. తన కెప్టెన్సీలో టీ20ల్లో జట్టుకు ప్రపంచకప్‌ను అందించాడు. 2015 వన్డే వరల్డ్ కప్ గెలవడంలో ఫించ్ కీలకపాత్ర పోషించాడు.
మరో నాలుగు రోజుల్లో ఇండియా ఆస్ట్రేలియా మధ్య ప్రతిష్ఠాత్మక బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ మొదలు కాబోతోంది. నాలుగు టెస్టుల ఈ సిరీస్ కోసం ఇప్పటికే అంచనాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. గత రెండుసార్లూ ఓడిపోయిన ఆసీస్ ఈ సారి ఎలాగైనా ఇండియాను దెబ్బతీయాలని ఎదురుచూస్తోంది.