ఎస్పీ బాలు గానంతో మధుర తుషారాలు మనసు తాకుతాయి. మధువనాలు మళ్లీ పూస్తుంటాయి. చలువ పందిరి కింద కొత్త తాటాకు సుగంధం వంటిది బాలు గళం. మాఘమాసంలో నారింజ పరిమళం. అందులో తేనె వాగులు, మేలిముత్యాలు, వెన్నెల సోనలు ఉంటాయి. స్వర్గసీమలో సప్తస్వరాలే వసంత రాణులై ఆయన ఎదుట మయూరాల్లా నాట్యం చేస్తుంటాయి. ఏ లోకాన ఉన్నా ఆయన రాగరంజిత గానం మన హృదయాల్లో ప్రవహిస్తూనే ఉంటుంది. ప్రేక్షకలోకం పరవశిస్తూనే ఉంటుంది.
సినీగానంలో శిఖరసమానుడు. జ్ఞాపకాలతో కడిగేస్తుంటే చెమ్మగిల్లని కళ్లు ఉంటాయా? ఓ కవి అన్నట్లు కాలికి తడి అంటకుండా సముద్రాలు దాటవచ్చు.కానీ కంటికి తడి అంటకుండా జీవితాన్ని దాటలేరు. జీవితంలో మనం ఇన్ని మంచిపనులు చేశాం. ఇంత ఉపాకరం చేశాం అని ఆత్మ సంతృప్తితో సమీక్షించుకునే సందర్భాలకంటే విలువైన క్షణాలేముంటాయి? అందరి మోమున నవ్వులు పూయిస్తూ, గుడికట్టుకుని ఆరాధించే మహానుభావులకు గుండెనిండా గుడిగంటలతో స్వరనైవేద్యం పెడుతుంటే అంతకంటే జీవితానికి సార్ధకత ఏముంటుంది? సంగీత ప్రపంచానికి కొన్ని తరాలను తయారుచేసిస్తుంటే జన్మ ధన్యం కాదా?
'పాడుతా తీయగా'లో సంగీత వాద్యబృందంలో ఏఏ కళాకారుడు ఏఏ పరికరంతో సహకరిస్తున్నాడో బాలూ జ్ఞాపకం ఉంచుకుంటారు. అందుకే ఆయన సంగీత, సాహిత్య సమలంకృతం. అంతరంగాలలోని మధుర స్మృతుల ఆవిష్కరణకు అవార్డులు ఇస్తే ప్రథమ పురస్కారం ఆయనకే దక్కుతుంది. బాల సుబ్రహ్మణ్యం మెదడు పెద్ద మెమొరీ కార్డు. వేలవేల గిగాబైట్ల జ్ఞాన భాండాగారం. ఆయనతో సంభాషించడం అంటే తెలుగు సినిమా ఐదున్నర దశాబ్దాలు తన జ్ఞాపకాలను, వ్యాపకాలను నెమరువేసుకోవటమే. ఆయన మానస పుత్రిక ఈటీవీ 'పాడుతా తీయగా'.
19వ సీజన్ త్వరలో
వ్యాఖ్యాతగా ఆయన దశాబ్దాల సంగీత యాత్ర వివరించే సందర్భంలో.. ఆ మాట కచేరీలో, ఆ పాట కచేరీలో బాలూ స్మృతిపథాన్ని తాకని మనిషి ఉండరు. దక్షిణాది రాష్ట్రాల్లోనే తొలి రియాలిటీ షోగా ప్రారంభమైన ఈ కార్యక్రమానికి పాతికేళ్లు. యువ గాయనీగాయకులు ఎక్కడ ఉన్నా వారిని వెలుగులోకి తీసుకొచ్చేందుకు ఎస్పీబాలు ఈటీవీ వేదికగా 1996లో ప్రారంభించిన ఈ కార్యక్రమం తొలిసారి ఆయన పరోక్షంలో ప్రజల ముందుకు రాబోతోంది. నిజజీవిత వారసుడు ఎస్పీ చరణ్ ఈ కార్యక్రమంలో కూడా బాలు వారసత్వాన్ని ఘనంగా సంగీత ప్రపంచం ముందుకు తీసుకుని రాబోతున్నారు. ఇప్పటికి 18 సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న 'పాడుతా తీయగా' 19వ సీజన్ త్వరలో ఈటీవీలో ప్రసారం కానుంది.
16 మంది సింగర్స్ రెడీ
ఇటీవలే ఏపీ, తెలంగాణల్లోని యువ గాయనీ గాయకుల ఎంపిక ప్రక్రియ పూర్తయింది. నాలుగు వేల మందిని ఆన్‌లైన్ ఆడిషన్స్ ద్వారా పరీక్షించి అందులో నుంచి 16 మంది బెస్ట్ సింగర్స్‌ను న్యాయనిర్ణేతలు ఎంపిక చేశారు. అద్భుత గీతాలతో తెలుగు టీవీ ప్రేక్షకులను రంజింపచేయటానికి 19వ సీజన్ సిద్ధమవుతోంది. ఈసారి జడ్జిలుగా రాబోతున్నవారు కూడా ఈ కార్యక్రమాన్ని మరింత రక్తికట్టిస్తారని అంచనా వేస్తున్నారు.
జడ్జిలు వీరే
పొడిబారిన హృదయాల్లో తడిచేరేలా అద్భుత గీతాలను రాసిన చంద్రబోస్, సరస్వతీవీణలా మధురస్వరాలు పలికే సింగర్ సునీత, యంగ్ టాలెంటెడ్ సింగర్‌గా ఇండస్ట్రీలో గుర్తింపుపొందిన విజయ్ ప్రకాశ్ తమదైన శైలిలో యువగాయనీ గాయకులకు మార్గనిర్దేశం చేయబోతున్నారు.
కొత్త సీజన్‌పై ఆసక్తి
బాలు లేకుండా ఆయన కుమారుడు చరణ్ సంగీత సారథ్యంలో ప్రేక్షకుల ముందుగా రాబోతున్న 'పాడుతా తీయగా'పై ఆసక్తి నెలకొంది. ఇటీవల జరిగిన బాలు ప్రథమ వర‌్థంతి సభలో బాలు ఉపయోగించిన మైకును రామోజీరావు, చరణ్‌కు అందించటం ద్వారా బాలు మానసపుత్రిక అయిన ఈ కార్యక్రమాన్ని ఆయన తనయుడి చేతుల్లో పెట్టారని అందరూ భావించారు.