చిత్రం: సేనాపతి; నటీనటులు: రాజేంద్ర ప్రసాద్, నరేశ్ అగస్త్య, హర్షవర్థన్, జ్ఞానేశ్వరి, సత్య ప్రకాశ్, రాకేందు మౌళి తదితరులు; సంగీతం: శ్రవణ్ భరద్వాజ్; నిర్మాత: సుస్మిత కొణిదెల, విష్ణు ప్రసాద్; దర్శకత్వం: పవన్ సాదినేని; విడుదల: ఆహా ఓటీటీ
హాస్య కథానాయకుడిగా, నటుడిగా తెలుగు తెరపై చెరగని ముద్రవేశారు రాజేంద్రప్రసాద్. ఇటీవల కాలంలో ఆయన కథాబలమున్న పాత్రలనే ఎంచుకుంటున్నారు. అలా ఆయన కీలక పాత్రలో నటించిన చిత్రం 'సేనాపతి'(Senapathi). తమిళంలో ఘన విజయం సాధించిన '8 తొట్టకళ్' రీమేక్‌గా ఈ చిత్రం రూపొందింది. మరి సేనాపతి కథ ఏంటి? అతను ఏం చేశాడు? పవన్ సాదినేని ఎలా తెరకెక్కించారు?(Senapathi review)
కథేంటంటే: చేయని నేరానికి బాల్యంలో ఎనిమిదేళ్లు జువైనల్ హోమ్‌లో ఉన్న కృష్ణ (నరేష్ అగస్త్య).. కష్టపడి చదివి ఎస్సై అవుతాడు. ఎవరికీ అన్యాయం జరగకూడనేది అతడి ఆశయం. ఐపీఎస్ కావాలనేది అతడి లక్ష్యం. అయితే ఓ క్రిమినల్‌ను పట్టుకునే క్రమంలో అతడి సర్వీస్ రివాల్వర్ పోతుంది. మరి అది ఎవరికి దొరికింది? అక్కడి నుంచి ఎక్కడికి వెళ్లింది? హైదరాబాద్ సిటీలో ఓ బ్యాంకు దోపిడీకి, వరుస హత్యలకు ఆ గన్ ఎలా సాక్ష్యంగా నిలిచింది? గన్ మళ్లీ తన చేతికి రావడం కోసం కృష్ణ ఎటువంటి ప్రయత్నాలు చేశాడు? బ్యాంకు దోపిడీ చేసిన మూర్తి అలియాస్ కృష్ణమూర్తి (రాజేంద్ర ప్రసాద్) కథ ఏమిటి? కృష్ణ, మూర్తి ఎలా కలుసుకున్నారు? చివరకు, ఏమైంది?
ఎలా ఉందంటే: ఒక భాషలో విజయవంతమైన చిత్రాలు ఇతర భాషల్లో రీమేక్ అవుతుంటాయి. అయితే, ఆ భాష, ప్రాంతానికి దగ్గరగా ఎలాంటి మార్పులతో తెరకెక్కించారన్న దానిపై ఆ సినిమా విజయం ఆధారపడి ఉంటుంది. లేకపోతే డబ్బింగ్ మూవీ చూశామన్న ఫీలింగ్ ప్రేక్షకుడికి కలుగుతుంది. అలా తమిళంలో విడుదలై మంచి టాక్ తెచ్చుకున్న ‘8 తూట్టకళ్’ మూవీని ‘సేనాపతి’ పేరుతో తెరకెక్కించడంలో దర్శకుడు పవన్ సాదినేని సఫలమయ్యారు. చేయని నేరానికి కృష్ణ జైలుకు వెళ్లడంతో సినిమాను ప్రారంభించిన దర్శకుడు త్వరగానే ప్రేక్షకుడు కథకు కనెక్ట్ అయ్యేలా చేశారు. కృష్ణ వ్యక్తిత్వం, తనలా మరొకరు ఇబ్బంది పడకూడదన్న ఆశయం తదితర సన్నివేశాలతో సినిమా అలా సాగిపోతుంటుంది. మరోవైపు పోలీసు వ్యవస్థలో వేళ్లూనుకున్న అవినీతి, నిర్లక్ష్యం వల్ల ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారన్న విషయాలను దర్శకుడు ప్రస్తావించాడు. కథానాయిక ఉన్నా ఫక్తు కమర్షియల్ డ్రామావైపు వెళ్లకుండా లవ్‌ట్రాక్, పాటల జోలికి పోకుండా కేవలం కథపైనే దృష్టి పెట్టిన విధానం బాగుంది.
ఎప్పుడైతే కృష్ణ సర్వీస్ రివాల్వర్ పోగొట్టుకున్నాడో అప్పుడు అసలు కథ మొదలవుతుంది. దాన్ని కనిపెట్టేందుకు కృష్ణ చేసే ప్రయత్నాలతో చకచకా సన్నివేశాలు సాగిపోతాయి. గన్స్‌ను ఎలా మారుస్తారు? ఒకరి నుంచి మరొకరికి ఎలా మారతాయి? ఎక్కడెక్కడ దొరుకుతాయి? వంటి విషయాలు ఆసక్తికరంగా ఉంటాయి. పైకి సాధారణ వ్యాపారులుగా కనిపించే వ్యక్తులు ఎలా క్రైమ్ వరల్డ్‌ను డీల్ చేస్తారన్నది చూపించారు. అటు తిరిగి, ఇటు తిరిగి ఆ గన్ చివరకు మూర్తి దగ్గరకు వస్తుంది. అదే గన్‌తో బెదిరించి మూర్తి మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి బ్యాంకు దోపిడీ చేస్తాడు. ఈ క్రమంలో పొరపాటున గన్ పేలి ఐదేళ్ల పాప చనిపోవడంతో కథ మరింత ఆసక్తిగా మారుతుంది. ఇక్కడి నుంచి కథలో వేగం పెరుగుతుంది. ఒకవైపు తన తుపాకీ కోసం స్పెషల్ ఆఫీసర్(హర్షవర్థన్)తో కలిసి కృష్ణ ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టడం, మరోవైపు దోచుకున్న డబ్బు పోలీసులకు చిక్కకుండా మూర్తి అండ్ కో ప్రయత్నాలు ఉత్కంఠగా సాగుతాయి. ఈ క్రమంలో మూర్తి తీసుకున్న ఒక్కో నిర్ణయం కృష్ణను మరింత చిక్కుల్లో పడేస్తుంది. అక్కడి నుంచి వచ్చే ఒక్కో ట్విస్ట్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతుంది. మూర్తి ఎదురుగానే కనిపిస్తున్నా అతడే అసలు సూత్రధారి అని కృష్ణ ఎలా నిరూపించాడు? అసలు మూర్తి వెనుక ఉన్న ఫ్లాష్‌బ్యాక్ ఏంటి? తదితర విషయాలన్నీ ఉత్కంఠగా కనిపిస్తాయి. పతాక సన్నివేశాలు మెప్పిస్తాయి. ఒక మంచి థ్రిల్లర్ చూశామన్న భావన ప్రేక్షకుడిలో కలుగుతుంది. థియేటర్‌లో విడుదలయ్యేందుకు అన్ని అర్హతలు ఈ సినిమాకు ఉన్నాయి.
ఎవరెలా చేశారంటే: 'సేనాపతి' చిత్రంలో కనిపించే పాత్రలు తక్కువే. అయినా ప్రతి పాత్రా కథతో ముడిపడి ఉంటుంది. ఎస్సై కృష్ణగా నరేశ్ అగస్త్య చక్కగా సరిపోయారు. తనదైన నటనతో మెప్పించారు. ఇక ఈ సినిమాకు మూలం మూర్తి అలియాస్ కృష్ణమూర్తి పాత్ర పోషించిన రాజేంద్రప్రసాద్. మూర్తి పాత్రలో రాజేంద్రప్రసాద్‌ను తప్ప మరొకరిని ఊహించలేం. తన అనుభవాన్ని అంతా రంగరించి మూర్తిగా సరికొత్తగా ఆయన కనిపిస్తారు. మూర్తిపాత్ర కోసం ఆయన ఆహార్యం, డిక్షన్ చాలా బాగున్నాయి. మిగిలిన వాళ్లు తమ పాత్ర పరిధి మేరకు చక్కగా నటించారు.
సాంకేతికంగా సినిమా బాగుంది. శ్రవణ్ నేపథ్య సంగీతం ప్రేక్షకుడిని సినిమాలో మరింత ఇన్‌వాల్వ్ చేసింది. వివేక్ కాలేపు సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. కొన్ని సన్నివేశాల్లో డార్క్ థీమ్, లైటింగ్ ఎఫెక్ట్ సహజంగా ఉన్నాయి. గౌతమ్ ఎడిటింగ్ కూడా చక్కగా కుదిరింది. ద్వితీయార్ధంలో ఒకట్రెండు సన్నివేశాలను ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది. '8 తూట్టకళ్'ను 'సేనాపతి'గా మార్చడంలో దర్శకుడు పవన్ విజయం సాధించారు. క్రైమ్ థ్రిల్లర్‌లను ఇష్టపడేవాళ్లను 'సేనాపతి' విశేషంగా మెప్పిస్తాడు. రెండున్నర గంటల పాటు ప్రేక్షకుడికి చక్కటి వినోదాన్ని పంచుతాడు. కమర్షియల్ అంశాల జోలికి పోకుండా కేవలం కథ, కథనాలను పవన్ నడిపించిన తీరు బాగుంది. ఒక క్రైమ్ థ్రిల్లర్‌ను మాత్రమే కాకుండా అవినీతి, నిర్లక్ష్యంతో పాటు, వృద్ధులైన తల్లిదండ్రుల పట్ల పిల్లలు వ్యవహరిస్తున్న తీరును ఇందులో చర్చించారు. ముఖ్యంగా కుటుంబ బంధాలపై డబ్బు ప్రభావం ఎలా ఉంటుందన్నది మూర్తి పాత్ర ద్వారా చూపించిన విధానం భావోద్వేగాన్ని కలిగిస్తుంది. నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి
బలాలు
+ కథ, దర్శకత్వం
+ రాజేంద్రప్రసాద్, నరేశ్ అగస్త్య
+ సాంకేతిక బృందం పనితీరు
బలహీనతలు
- ద్వితీయార్ధంలో కాస్త నెమ్మదిగా సాగే కథనం
చివరిగా: థ్రిల్లింగ్ 'సేనాపతి'
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
- " class="align-text-top noRightClick twitterSection" data="">