చిత్రం: రాజా విక్రమార్క; నటీనటులు: కార్తికేయ, తాన్య రవిచంద్రన్, సుధాకర్ కోమాకుల, సాయికుమార్, తనికెళ్ల భరణి, పశుపతి, హర్ష వర్ధన్ తదితరులు; సంగీతం: ప్రశాంత్ ఆర్.విహారి; కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: శ్రీ సరిపల్లి; నిర్మాత: 88 రామారెడ్డి; విడుదల తేదీ: 12-11-2021.
'ఆర్ఎక్స్100' సినిమాతో(rx 100 movie) విజయాన్ని అందుకోవడమే కాకుండా కథానాయకుడిగానూ అందరి దృష్టినీ ఆకర్షించారు కార్తికేయ. ఆ చిత్రం తర్వాత ఆయన నుంచి అరడజను వరకు చిత్రాలొచ్చినా.. ఏదీ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు. దీంతో ఈసారి ఎలాగైనా హిట్టు మాట వినిపించాలనే లక్ష్యంతో 'రాజా విక్రమార్క'లా(raja vikramarka 2021) ప్రేక్షకుల ముందుకొచ్చారు. కొత్త దర్శకుడు శ్రీసరిపల్లి తీసిన చిత్రమిది. ఎన్ఐఏ కథాంశంతో రూపొందిన థ్రిల్లర్ సినిమా కావడం.. దీనికి తగ్గట్లుగానే టీజర్, ట్రైలర్ ఆసక్తికరంగా ఉండటం వల్ల సినీప్రియుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఆ అంచనాల్ని అందుకోవడంలో ఈ విక్రమార్కుడు సఫలమయ్యాడా? లేక విఫలమయ్యాడా?
కథేంటంటే: విక్రమ్ అలియాస్ రాజా విక్రమార్క నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ)లో కొత్తగా చేరిన అధికారి. దూకుడుతో పాటు తొందరపాటు ఉన్న కుర్రాడు. ఓరోజు ఎన్ఐఏ బృందం అక్రమంగా ఆయుధాలు అమ్ముతున్న ఓ నల్లజాతీయుడ్ని పట్టుకుంటుంది. అతడిని విచారణ చేస్తున్న క్రమంలో పొరపాటున విక్రమ్ చేతిలోని తుపాకీ పేలడం వల్ల ఆ వ్యక్తి మరణిస్తాడు. అతను చనిపోవడానికి ముందు మాజీ నక్సలైట్ గురునారాయణ (పశుపతి)ను చూసినట్లు చెప్పడమే కాక.. అతడికి ఆయుధాలు అమ్మినట్లు చెబుతాడు. అతను చెప్పిన సగం వివరాల ఆధారంగా గురు నారాయణ లక్ష్యం హోంమంత్రి చక్రవర్తి (సాయికుమార్) అని గుర్తిస్తాడు ఎన్ఐఏ బృందాధికారి (తనికెళ్లభరణి). ఆ ముప్పు నుంచి మంత్రిని తప్పించేందుకు రహస్యంగా విక్రమ్‌తో కలిసి ఓ ఆపరేషన్ చేపడతాడు. మరి ఆ ఆపరేషన్ ఏంటి? హోంమంత్రిని కాపాడే క్రమంలో అతనికెదురైన సవాళ్లేంటి? అసలు గురు నారాయణకు చక్రవర్తికి మధ్య ఉన్న విరోధం ఏంటి? వీళ్లిద్దరి కథకు గోవింద్ నారాయణ (సుధాకర్ కోమాకుల)కు ఉన్న సంబంధం ఏంటి? మంత్రి కూతురు కాంతి (తాన్య రవిచంద్రన్)తో విక్రమ్ ప్రేమాయణం ఏమైంది? అన్నది తెరపై చూడాలి.
ఎలా సాగిందంటే: నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) నేపథ్యంలో సాగే కథలనగానే తీవ్రవాదులు.. వారి కుట్రలను అడ్డుకునేందుకు ఎన్ఐఏ అధికారులు చేసే సాహసాలే గుర్తొస్తుంటాయి. అయితే ఇది అలా దేశ సరిహద్దుల్లో సాగే కథ కాదు. రాష్ట్రంలో ఓ హోంమంత్రిని కాపాడేందుకు చేపట్టే ఆపరేషన్ నేపథ్యంలో సాగుతుంటుంది. ఆరంభంలో ఎన్ఐఏ బృందం అక్రమ ఆయుధాలు అమ్ముతున్న ఓ నల్లజాతీయుడ్ని అదుపులోకి తీసుకోవడం.. విచారణ సమయంలో అతను ఓ కుట్రకు సంబంధించిన సగం వివరాలు బయటపెట్టాక ప్రమాదవశాత్తూ మరణించడం వల్ల కథ ఆస్తకికరంగా మొదలవుతుంది. దీంతో ఆ సగం వివరాలతో హీరో ఆ కుట్రను ఎలా అడ్డుకుంటాడు? అన్న ఆసక్తి ప్రేక్షకుల్లో కలుగుతుంది. నిజానికి అక్కడి నుంచి కథను ఉత్కంఠభరితంగా ముందుకు తీసుకెళ్లడానికి కావాల్సినంత ఆస్కారమున్నా.. దర్శకుడు సరైన విధంగా వాడుకోలేదు. రహస్య ఆపరేషన్‌లో భాగంగా విక్రమ్ ఓ సాధారణ వ్యక్తిలా హోంమంత్రి ఇంట్లోకి చేరడం.. ఈ క్రమంలో మంత్రి కూతురితో ప్రేమలో పడటం వంటి సన్నివేశాలు రొటీన్‌గా అనిపిస్తుంటాయి. విక్రమ్ బృందం గురు నారాయణను పట్టుకున్నాకే మళ్లీ కథలో కాస్త కదలిక వస్తుంది. విరామానికి ముందు హోంమంత్రి కుమార్తెను గురు బృందం కిడ్నాప్ చేయడం వల్ల ద్వితీయార్ధంలో ఏం జరగబోతుందా అన్న ఆసక్తి కలుగుతుంది.
అయితే ప్రథమార్ధంతో పోల్చితే ద్వితీయార్ధాన్ని మరింత గందరగోళంగా రాసుకున్నాడు దర్శకుడు. ముఖ్యంగా మంత్రి చక్రవర్తి.. నక్సలైట్ గురు నారాయణకు సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ చాలా పేలవంగా అనిపిస్తుంది. హోంమంత్రి కూతుర్ని విడిపించేందుకు నారాయణను ఎన్ఐఏ బృందం విడిచి పెట్టాలనుకోవడం.. ఈ క్రమంలో నక్సల్స్‌కు ఎన్ఐఏ బృందానికి మధ్య జరిగిన కాల్పుల్లో ఇటు మంత్రి, అటు నారాయణ చనిపోవడం వల్ల కథ అక్కడికే ముగిసింది కదా అనిపిస్తుంది. అయితే అక్కడి నుంచి సుధాకర్ కోమాకుల పాత్రను ప్రతినాయకుడిగా చూపిస్తూ.. కథను బలవంతంగా సాగతీసే ప్రయత్నం చేశాడు దర్శకుడు. దీంతో ఆ తర్వాత సాగే కథనమంతా ప్రేక్షకుల సహనానికి పరీక్షలాగే తోస్తుంటుంది. ముగింపునకు ముందు కాంతిని కనిపెట్టేందుకు విక్రమ్ చేసే ప్రయత్నాలు.. పతాక సన్నివేశాల్లో విక్రమ్‌కు, గోవింద్ నారాయణకు మధ్య సాగే పోరు సినిమాకు కాస్త ఊపు తీసుకొస్తుంది.
ఎవరెలా చేశారంటే: రాజా విక్రమార్క పాత్రలో కార్తికేయ చక్కగా ఒదిగిపోయాడు. తన సిక్స్ ప్యాక్ లుక్ ఆ పాత్రకు మరింత ఆకర్షణ తీసుకొచ్చింది. యాక్షన్ సన్నివేశాల్లో చాలా స్టైలిష్‌గా కనిపించాడు. హోంమంత్రి కూతురిగా కాంతి పాత్రలో తాన్య పరిధి మేర నటించింది. నిజానికి పాత్ర పరంగా నటించేందుకు ఆమెకు అంతగా ఆస్కారం లభించలేదు. ప్రథమార్ధంలో ఓ పాటలో తన క్లాసికల్ డ్యాన్స్‌తో ఆకట్టుకుంటుంది. సాయికుమార్, తనికెళ్లభరణి, పశుపతిలాంటి అనుభవజ్ఞులైన నటుల్ని దర్శకుడు అంతగా ఉపయోగించుకోలేకపోయాడు. ఎల్ఐసీ ఏజెంట్‌గా హర్షవర్ధన్ అక్కడక్కడా కాసిన్ని నవ్వులు పూయించే ప్రయత్నం చేశారు. ప్రతినాయకుడి పాత్రలో సుధాకర్ ఫర్వాలేదనిపించాడు. కథ పరంగా శ్రీసరిపల్లి ఏమాత్రం కసరత్తు చేయలేదనిపిస్తుంది. ప్రశాంత్ ఆర్.విహారి నేపథ్య సంగీతం, పీసీ మౌళి ఛాయాగ్రహణం సినిమాకు కాస్తంత బలాన్నిచ్చాయి.
బలాలు
+ కార్తికేయ నటన
+ ప్రథమార్ధం
+ నేపథ్య సంగీతం
బలహీనతలు
- కథ.. కథనం
- రొటీన్ లవ్‌ట్రాక్
- ద్వితీయార్ధం.. ముగింపు
చివరగా: మళ్లీ పట్టుతప్పిన విక్రమార్కుడు
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
ఇది చదవండి: Pushpaka vimanam movie review: 'పుష్పక విమానం' ఎలా ఉందంటే?