చూస్తేనే ఎనర్జీ...
తారక్‌తో కలిసి ‘జై లవ కుశ’లో నటించా. తన డాన్స్‌కి వీరాభిమానిని. ఎనర్జీకి మారు పేరు తారక్. సెట్‌లో తనతో ఉన్నవాళ్లకీ ఆ ఎనర్జీ వచ్చేస్తుంది. అందర్నీ ఉత్సాహపరచడం తన ప్రత్యేకత. తెలుగు చాలా స్పష్టంగా మాట్లాడతాడు. తారక్ మాట్లాడుతుంటే అలానే వినాలనిపిస్తుంది. జ్వరం ఉన్నా, ఇతర షూటింగుల వల్ల నిద్రలేకపోయినా, మరో సమస్య ఉన్నా పట్టించుకోడు. దర్శక నిర్మాతలకి ఇబ్బంది కలగకుండా తన డేట్స్ ప్రకారం షూటింగుకు హాజరవుతాడు. వృత్తిగతంగా తన నుంచి నేను ఎన్నో నేర్చుకున్నా.
చిన్న పిల్లాడే...
చాలామంది నటులు రజనీ సర్‌తో కలిసి ఒక్క సీన్‌లో అయినా నటించాలని ఆశపడుతుంటారు. ‘దర్బార్’లో ఆయన కూతురి పాత్రలో నటించిన నాకు ఆ కోరిక తీరింది. ఆయన వయసులో పెద్దవారు కావచ్చు కానీ హుషారు చూస్తే చిన్నపిల్లాడిలానే అనిపిస్తారు.. మొదటిరోజు నన్ను చూడగానే ‘అరే... ఈ అమ్మాయి బాగా నటిస్తోంది. తన సినిమాలు చూశాను’ అంటూ దర్శకుడితో చెబుతుంటే నాకెంతో గర్వంగా అనిపించింది. సెట్‌లో సైలెంట్‌గా ఉండి... చుట్టుపక్కల ఏం జరుగుతుందో గమనిస్తుంటారు. ఆయనతో కూర్చుంటే పోషకాహారం, ఆధ్యాత్మిక విషయాల గురించి మాట్లాడతారు. ఈ వయసులోనూ ఆయన ప్రతిరోజూ రెండు పూటలా వర్కవుట్లు చేస్తారు. ఆహార నియమాలూ చాలా కఠినంగా పాటిస్తారు.
ఓపిక ఎక్కువ...
కమల్ హాసన్ తరవాత నాకు ఇష్టమైన హీరో నాని. తను నా బెస్ట్ ఫ్రెండ్ కూడా. ‘జెంటిల్‌మన్’, ‘నిన్నుకోరి’, ‘వి’ చిత్రాల్లో నానీతో నటించా. తను చాలా సరదా మనిషి. నేను ఏ సందేహం అడిగినా ఓపిగ్గా సమాధానం చెబుతుంటాడు. తెలుగు డైలాగులు పలికే విషయంలో ఎంతో సాయపడేవాడు.
. అలా చెప్పడం వల్ల నాకు కొత్త విషయాలు తెలుస్తాయి.
మర్యాదస్తుడు...
నేను ‘118’లో కల్యాణ్‌రామ్‌తో కలిసి నటించా. తన చుట్టుపక్కల ఎవరన్నా సీరియస్‌గా కనిపిస్తే వెంటనే వాళ్లని నవ్విస్తాడు. అలానే తక్కువ మాట్లాడతాడు. మాట కలిపితే మాత్రం తనకంటే బాగా ఎవరూ మాట్లాడలేరు అనిపిస్తుంది. అందరితోనూ మర్యాదగా నడుచుకుంటాడు. ‘118’లో నటిస్తున్నప్పుడు వాళ్ల నాన్నగారూ, మా నానమ్మా ఒకే రోజు చనిపోయారు. నేను మూడ్రోజులకి సెట్‌కి వెళ్లా. నేను వెళ్లేలోపే కల్యాణ్ అక్కడ ఉండటం చూసి ఆశ్చర్యపోయా.
కష్టపడతాడు...
తాజాగా విడుదలైన ‘వి’లో సుధీర్‌బాబుతో కలిసి నటించా. తను పోలీస్‌ఆఫీసర్ పాత్రకి చక్కగా సరిపోయాడు. సుధీర్ ఫిట్‌నెస్ ఫ్రీక్ కావడంతో పాత్రకి తగ్గట్టు తనని తాను మార్చుకుంటుంటాడు. బాగా కష్టపడే మనస్తత్వం. షూటింగు విరామంలో స్క్రిప్టు పట్టుకుని తరవాత సీన్ ఎంత బాగా పండించాలా అని ఆలోచిస్తుంటాడు. ఎప్పుడైనా మాట కలిపితే ఫిట్‌నెస్, డైట్ గురించి బోలెడు విషయాలు చెబుతుంటాడు. తను స్కూల్ డేస్ నుంచీ బ్యాడ్మింటన్ ప్లేయర్ అని షూటింగు సమయంలోనే తెలిసింది. సుధీర్ గురించి చెప్పాలంటే తను కంప్లీట్ ఫ్యామిలీ మ్యాన్.