ఓటీటీ వేదికల ప్రాభవంతో.. సృజనాత్మకతకు హద్దులు తొలగిపోతున్నాయి. ఇక్కడ ప్రాంతీయ భాషా హద్దులు లేకపోవడం వల్ల.. తమ ప్రతిభను ప్రపంచానికి చూపించుకునేందుకు నటీనటులకు మంచి అవకాశం దొరుకుతోంది. వినూత్న కథాంశాలతో ప్రయోగాలు చేసేందుకు.. తమ మార్కెట్‌ను విస్తృతం చేసుకునేందుకు వీలు చిక్కుతోంది. వీటన్నింటికీ తోడు కళ్లు చెదిరే స్థాయిలో పారితోషికాలు అందుతుండటం వల్ల.. ఇప్పుడీ ట్రెండ్‌ను అగ్ర కథానాయకులు అందిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే బాలీవుడ్‌లో అక్షయ్ కుమార్, హృతిక్ రోషన్, రణ్‌వీర్ సింగ్ వంటి స్టార్ నాయకులంతా ఓటీటీ బాట పట్టగా.. ఇప్పుడిప్పుడే దక్షిణాది అగ్ర హీరోలు (South indian movies on ott) ఆ దారిలో అడుగేసేందుకు సిద్ధమవుతున్నారు.
'ఆకాశమే హద్దురా' చిత్రంతో గతేడాదే ఓటీటీలో విజయాన్ని రుచి చూశారు తమిళ అగ్ర కథానాయకుడు సూర్య. ఇటీవలే 'నవరస' వెబ్‌సిరీస్‌తో నెట్‌ఫ్లిక్స్ వేదికగా ప్రేక్షకులకు వినోదాన్ని పంచిచ్చారు. సూర్య నటించిన తొలి వెబ్ సిరీస్ ఇది. దర్శకుడు మణిరత్నం నిర్మించారు. హాస్యం, శృంగారం, కరుణ, శాంతం, రౌద్రం, భీభత్సం, భయానకం, అద్భుతం, వీరం ఇలా నవరసాలతో కూడిన కథాంశాలతో ఈ సిరీస్ రూపొందించారు. ఇందులోనే గౌతమ్ మేనన్ తెరకెక్కించిన 'మీటావు నా గిటారు తీగలు' అనే రొమాంటిక్ కథలో నటించారు సూర్య. ఆయన నటించిన తదుపరి చిత్రం 'జై భీమ్' త్వరలో ఓటీటీలోనే విడుదల కానుంది.
ఓ ఇమేజ్ ఛట్రంలో ఇరుక్కుపోకుండా.. వైవిధ్యభరిత కథలతో అలరించడంలో ఎప్పుడూ ముందుంటారు తెలుగు అగ్ర హీరో వెంకటేశ్. ఇప్పుడాయన ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్ కోసం ఓ హిందీ వెబ్‌సిరీస్‌లో నటించేందుకు అంగీకారం తెలిపినట్లు తెలిసింది. దీనిపై నిర్మాత సురేశ్‌బాబు ఇటీవలే స్పష్టత ఇచ్చారు. ఓ విభిన్నమైన కథాంశంతో ఈ సిరీస్ రూపొందనుందని, వచ్చే ఏడాది సెట్స్‌పైకి వెళ్తుందని, దీన్ని హిందీతో పాటు అన్ని దక్షిణాది భాషల్లోనూ విడుదల చేయనున్నారని తెలిపారు. ఈ సిరీస్‌లో వెంకీ.. రానా కలిసి నటించనున్నట్లు సమాచారం.
- అగ్ర హీరో నాగార్జున ఓటీటీ ఎంట్రీపై కొన్నాళ్లుగా వార్తలొస్తున్నాయి. ఇప్పటి వరకు ఏ ప్రాజెక్ట్ అధికారికంగా ప్రకటించకున్నా.. త్వరలో ఓ కొత్త కబురు వినడం ఖాయమని సంకేతాలు అందుతున్నాయి. దీనిపై నాగ్ ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు. "ఓ ఆలోచన అనుకున్నాం. బాగా నచ్చింది. ఆ కథలో నటించాలనుకుంటున్నాను. అయితే ప్రస్తుతం అది డెవలప్‌మెంట్ స్టేజ్‌లో ఉంది. అంతా అనుకున్నట్లు అది ఓటీటీ చిత్రమే. సినిమాల్లో ఇప్పటివరకు నేను ప్రయత్నించనివి ఇందులో చేయనున్నాను" అని తెలియజేశారు. ఇదెప్పుడు సెట్స్‌పైకి వెళ్తుందన్నది చెప్పలేనన్నారు.
- వెండితెరపై వరుస సినిమాలతో జోరు చూపిస్తున్నారు యువ కథానాయకుడు నాగచైతన్య. త్వరలో ఆయనా ఓటీటీల్లోకి కాలుమోపనున్నట్లు వార్తలు వినిస్తున్నాయి. దర్శకుడు విక్రమ్ కె.కుమార్ తెరకెక్కించనున్న ఓ వెబ్‌సిరీస్‌తో ఆయన ఓటీటీ వేదికలపైకి అడుగుపెట్టనున్నట్లు ప్రచారం వినిపిస్తోంది. ఇందుకోసం విక్రమ్ ఇప్పటికే ఓ కథ సిద్ధం చేసినట్లు సమాచారం. చైతూ ప్రస్తుతం విక్రమ్ దర్శకత్వంలోనే 'థ్యాంక్ యూ' చిత్రంలో నటిస్తున్నారు.
ఇదీ చూడండి : ఈ స్పోర్ట్స్ డ్రామా చిత్రాలపై ఓ లుక్కేయండి!