తెలుగు సినీ పరిశ్రమ సమస్యల విషయమై చిత్ర పరిశ్రమలో ఉన్నతస్థాయి సమీక్ష ఆదివారం జరుగనుంది. తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి ఆధ్వర్యంలో ఫిల్మ్‌నగర్ కల్చరల్ సెంటర్లో జరిగే ఈ సమావేశానికి 24 శాఖలకు చెందిన సంఘాల ప్రతినిధులు హాజరు కానున్నారు.
సినీ పరిశ్రమలో కరోనా కాలంలో ఎదురైన ఆటంకాలు, ఇటీవల తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు జారీ చేసిన జీవోలు, సినీ కార్మికుల సంక్షేమంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఇందుకోసం ఫిల్మ్ ఛాంబర్లోని ప్రొడ్యూసర్ కౌన్సిల్, ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ , డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ , స్టూడియో సెక్టార్, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ , ఫిల్మ్ ఫెడరేషన్ , డైరెక్టర్స్ అసోసియేషన్ సహా అన్ని సంఘాలను సమావేశానికి ఆహ్వానించారు. సుమారు 200 మందికిపైగా ప్రముఖులు ఈ సమావేశానికి హాజరై సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించనున్నారు.
'మా' అధ్యక్షుడు మంచు విష్ణుతో పాటు సినీ పెద్దలు మోహన్ బాబు, చిరంజీవి, మురళీమోహన్, తమ్మారెడ్డి భరద్వాజ సహా ఇతర ప్రముఖులంతా ఈ సమావేశానికి హాజరుకానున్నట్లు తెలుస్తోంది. ఏపీ ముఖ్యమంత్రి జగన్‌తో చిరంజీవి భేటీ కంటే ముందు ఈ సమావేశం జరగాల్సి ఉండగా రెండుసార్లు వాయిదా పడింది. ఇటీవల ఏపీ ప్రభుత్వం సినీ పరిశ్రమ సమస్యలు, ప్రతిపాదనలపై సానుకూలంగా స్పందిస్తూ ఈ నెలాఖరులో ఉత్తర్వులు జారీ చేయనున్న క్రమంలో ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇవీ చదవండి: