దక్షిణాదిన ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (SIIMA awards) వేడుకలు త్వరలోనే జరగనున్నాయి . కరోనా కారణంగా గతేడాది ఈ వేడుకలు నిర్వహించలేదు. దాంతో 2019, 2020 సంవత్సరాలకి సంబంధించిన 'సైమా' పురస్కారాల ప్రదానోత్సవాలను ఈ ఏడాది నిర్వహించనున్నారు. హైదరాబాద్ వేదికగా సెప్టెంబరు 11, 12 తేదీల్లో ఈ కార్యక్రమం జరగనుంది. ఇప్పటికే 2019కి సంబంధించిన నామినేషన్లని ప్రకటించిన సైమా తాజాగా 2020 నామినేషన్లని ప్రకటించింది. వీటిల్లో సూర్య హీరోగా తెరకెక్కిన తమిళ చిత్రం 'సూరరై పొట్రు' అత్యధికంగా 14 విభాగాల నామినేషన్లతో ముందంజలో నిలిచింది. ఆ తర్వాతి స్థానంలో అల్లు అర్జున్ కథానాయకుడిగా నటించిన 'అల వైకుంఠపురములో', మహేశ్ బాబు 'సరిలేరు నీకెవ్వరు' చిత్రాలు 12 విభాగాల్లో పోటీపడుతున్నాయి. మలయాళీ చిత్రం 'అయ్యప్పనుమ్ కోషియుమ్'.. 12 విభాగాల్లో, కన్నడ సినిమాలు 'లవ్ మాక్‌టైల్', 'పాప్‌కార్న్ మంకీ టైగర్', 'ఫ్రెంచ్ బిరియాని'.. 10 విభాగాల్లో నామినేట్ అయ్యాయి.
2019 వివరాలు ఇవీ..: మహేశ్‌బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన 'మహర్షి' 10 నామినేషన్లతో ముందంజలో ఉండగా.. 'మజిలీ' 9, 'జెర్సీ' 7 నామినేషన్లతో రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. తమిళంలో ధనుష్ హీరోగా నటించిన 'అసురన్' 10 నామినేషన్లు, కార్తీ చిత్రం నటించిన 'ఖైదీ' 8 నామినేషన్లతో ఉన్నాయి. ఫాహద్ ఫాజిల్ నటించిన 'కుంబళంగి నైట్స్' నుంచి ఏకంగా 13 నామినేషన్లు వచ్చాయి. కన్నడ చిత్రం 'యజమాన' నుంచి 12 నామినేషన్లు దాఖలయ్యాయి.