సంగీత ప్రపంచానికి ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం మరణం తీరని విషాదమన్నారు రామోజీ గ్రూప్ ఛైర్మన్ రామోజీ రావు. ఆయన ఇక లేరంటే చాలా బాధగా, దిగులుగా ఉందని తెలిపారు. బాలు మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.
"బాలు ఇక లేరంటేనే బాధగా, దిగులుగా ఉంది. మనసు మెలిపెట్టినట్టు ఉంది. ఆయన గంధర్వ గాయకుడే కాదు.. నాకు అత్యంత ఆత్మీయుడు. గుండెలకు హత్తుకుని ప్రేమగా పలకరించే తమ్ముడు.
తెలుగు జాతికే కాదు ప్రపంచ సంగీతానికే ఆయన స్వరం ఓ వరం. 50 సంవత్సరాల ఆయన సినీ ప్రయాణంలో జాలువారిన వేల వేల పాటలు తేట తీయని తేనెల ఊటలు. ఎన్ని గానాలు.. ఎన్ని గమకాలు.. ఎన్ని జ్ఞాపకాలు.. ఏం గుర్తుకు వచ్చినా ఈ క్షణంలో కురిసేవి కన్నీటి జలపాతాలే. మా కోసం మధురమైన పాటలెన్నో మిగిల్చి మరలిపోయిన స్నేహితుడికి తిరిగి కనీసం మాటలు కూడా ఇవ్వలేని మహా విషాదమిది. బాలు.. నీకిదే మా అందరి అశ్రుతర్పణం."
- రామోజీ రావు, రామోజీ గ్రూప్ ఛైర్మన్