ఏ.ఆర్.రహమాన్... సంగీత అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు. సరిగ్గా పదేళ్ల క్రితం రెండు ఆస్కార్ అవార్డులు సాధించిన తొలి భారతీయుడిగా రికార్డులకెక్కారు.
ఆస్కార్ అవార్డు గెలిచిన ముందురోజు ఆకలితోనే ఉన్నానని పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. "అప్పటి నుంచి ప్రతీసారి నన్ను నేను సరికొత్తగా ఆవిష్కరించుకునేందుకు ప్రయత్నిస్తున్నా" అని రహమాన్ తెలిపారు.
స్లమ్‌డాగ్ మిలీయనర్ చిత్రానికి గాను ఆస్కార్ అవార్డు వచ్చి పదేళ్లు పూర్తయిన సందర్భంగా ముంబయి ధారావిలో ప్రత్యేకంగా వేడుక చేసుకున్నారు.
ధారావి... ఆసియాలోనే అతిపెద్ద మురికివాడ. ఈ ప్రాంతం నుంచి మిలీయనర్గా ఎదిగిన కుర్రాడి కథే ఈ సినిమా.
స్లమ్ డాగ్ మిలినీయర్ చిత్రానికి ఒరిజినల్ స్కోర్ అందినందుకు, జాతీయ స్థాయిలో హిట్ అయిన జైహో పాటకు గాను ఈ రెండు ఆస్కార్ అవార్డులు సొంతం చేసుకున్నారు ఏ.ఆర్.రహమాన్.
డాని బోయల్ దర్శకత్వం వహించిన స్లమ్ డాగ్ మిలీయనర్ 81వ అకాడమీ అవార్డు కార్యక్రమంలో 10 నామినేషన్స్‌తో పాటు,8 ట్రోఫీలను గెలుచుకుంది.
2011లో వచ్చిన 127 అవర్స్ సినిమాకి ఒరిజినల్ సాంగ్, స్కోర్ అందించి మరోసారి ఆస్కార్ బరిలో నిలిచారు రహమాన్.
సంగీత పరంగానే కాకుండా సినిమాలు నిర్మించడంలోనూ, సాంకేతికతను అందించడంలోనే ప్రత్యేక ముద్ర వేస్తున్నారు రహమాన్.