దాదాపు మూడేళ్ల విరామం తర్వాత పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ ముఖానికి రంగులద్దుకుని ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. తనని మరోసారి వెండితెరపై చూడాలనే ఆశతో ఉన్న సినీ ప్రేమికుల కోరికను మన్నిస్తూ ఆయన వరుస ప్రాజెక్ట్‌లు ఓకే చేసేశారు. మరోవైపు, 'సరిలేరు నీకెవ్వరు'తో ఈ ఏడాది ఆరంభంలోనే బ్లాక్‌బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న సూపర్‌స్టార్ మహేశ్‌బాబు ప్రస్తుతం 'సర్కారువారి పాట' కోసం సిద్ధమవుతున్నారు. అయితే, పవన్-మహేశ్ కలిసి నటిస్తే చూడాలని ఎంతోకాలం నుంచి అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికరమైన వార్త నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది.
మహేశ్‌బాబు-పవన్‌కల్యాణ్ కలిసి వెండితెరపై సందడి చేయనున్నారంటూ నెట్టింట్లో వార్తలు వస్తున్నాయి. కాకపోతే, అది పూర్తిస్థాయిలో కాదు కేవలం కొంతసమయం మాత్రమేనట. మహేశ్ కథానాయకుడిగా తెరకెక్కనున్న 'సర్కారువారి పాట'లో పవన్ అతిథిగా కనిపించనున్నారట. పవన్ కేవలం ఐదు నిమిషాలు మాత్రమే స్క్రీన్‌పై మెరవనున్నారట. ఈ మేరకు పలు పోస్టర్లు, పోస్టులు ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతున్నాయి. సదరు వార్తలు చూసిన ఫ్యాన్స్ ఎంతో సంతోషిస్తున్నారు. ఎన్నో ఏళ్ల నాటి తమ కల నిజమైతే బాగుండని అనుకుంటున్నారు.