సంక్రాంతి పండగంటే తెలుగువారికే కాదు సినీ పరిశ్రమకు కూడా ఓ ఉత్సాహం వస్తుంది. ఏడాది ఆరంభంలో వచ్చే ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని థియేటర్లలో సినిమాల జాతర మామూలుగా ఉండదు. భారీ వసూళ్లు.. రికార్డుల బ్రేక్‌లు.. ఇలాంటి సంబరాలకు సంక్రాంతి పండగ పెట్టింది పేరు. ఎంతోమంది స్టార్ హీరోలు ఈ సీజన్ రేసులో నిలబడి తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నవారే. అయితే, వచ్చే ఏడాది సంక్రాంతికి ఇప్పటికే ముగ్గురు స్టార్‌హీరోలు బెర్త్‌లు ఖరారు చేసుకున్నారు. బిగ్ ఫెస్టివ్ రేసుకు సిద్ధమైనట్లు ప్రకటించారు. ఇంతకీ ఎవరా హీరోలు? ఏమా చిత్రాలు? మీరూ ఓ లుక్కేసేయండి..!
సూపర్‌స్టార్‌కు కొట్టిన పిండి
అగ్రకథానాయకుడు మహేశ్‌బాబుకు సంక్రాంతి రేస్ కొత్తేమీ కాదు. ఆయన నటించిన చాలా సినిమాలు సంక్రాంతి కానుకగా విడుదలై ప్రేక్షకుల్ని అలరించాయి. 2002లో విడుదలైన 'టక్కరిదొంగ'తో ఆయన మొదటిసారి పండుగ పోటీలో నిలబడ్డారు. అనంతరం ఆయన.. 'ఒక్కడు', 'బిజినెస్ మేన్', 'సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు', '1 నేనొక్కడినే', 'సరిలేరు నీకెవ్వరు' చిత్రాలతో అలరించారు. అయితే, ఇప్పుడు మహేశ్ మరోసారి సంక్రాంతి బరిలోకి పందెంకోడిలా దిగుతున్నారు. పరశురామ్ దర్శకత్వంలో ఆయన కథానాయకుడిగా నటిస్తున్న 'సర్కారువారి పాట' వచ్చే ఏడాది విడుదల సంక్రాంతికి సినిమాను తీసుకురానున్నట్లు ఇటీవలే చిత్ర బృందం ప్రకటించింది. కీర్తిసురేశ్ కథానాయిక. ఇందులో మహేశ్ పొడవాటి లుక్, మెడపై రూపాయి టాటూతో విభిన్నంగా కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
పవర్‌స్టార్ ముచ్చటగా మూడోసారి
సంక్రాంతి పోటీలో మరో అగ్ర కథానాయకుడు పవన్‌కల్యాణ్ కూడా నిలిచారు. ఆయన కీలకపాత్రలో నటించిన 'గోపాల గోపాల' 2015లో సంక్రాంతి కానుకగా విడుదలై సత్ఫలితాలివ్వగా.. 2018లో విడుదలైన 'అజ్ఞాతవాసి' మిశ్రమ స్పందనలందుకుంది. అయితే, ఇప్పుడు మళ్లీ ఆయన 'అయ్యప్పనుమ్ కోషియుమ్' రీమేక్‌తో పండగ పోటీలోకి అడుగుపెట్టారు. సాగర్ కె.చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పవన్-రానా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. నిత్యామేనన్-ఐశ్వర్యా రాజేశ్ కథానాయికలు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతకంపై నిర్మితమవుతోన్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరిలో విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.
పాన్‌ఇండియా స్టార్ ప్రేమకథ
'బాహుబలి', 'సాహో' వంటి భారీ యాక్షన్ అడ్వంచెర్స్ తర్వాత ప్రభాస్ నటిస్తున్న పూర్తిస్థాయి ప్రేమకథా చిత్రం 'రాధేశ్యామ్'. వింటేజ్ లవ్‌స్టోరీగా రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమాలో పూజాహెగ్డే కథానాయిక. రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి 14న విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. మరోవైపు 'వర్షం' (2004), 'యోగి' (2008) చిత్రాలతో ప్రభాస్ ఇప్పటికే సంక్రాంతి రేస్ అనుభవాలు చవి చూశారు.
ఇదీ చూడండి.. One Movie Review: మమ్ముట్టి మరోసారి సీఎంగా మెప్పించారా?