బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ కుటుంబం తనను హింసించిందని ఆయన భార్య ఆలియా ఆరోపించారు. తన భర్త నుంచి విడాకులు తీసుకోబోతున్నట్లు ఆలియా ఇప్పటికే వెల్లడించారు. లాక్‌డౌన్ వల్ల ఈ-మెయిల్, వాట్సాప్ ద్వారా నోటీసులు పంపినట్లు ఆమె చెప్పారు. అయితే ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటో ఆమె తాజాగా మీడియాతో చెప్పారు. నవాజుద్దీన్ ఎప్పుడూ తనపై చేయి ఎత్తలేదని, అయితే ఆయన కుటుంబ సభ్యులు మానసికంగా, శారీరకంగా హింసించారని ఆరోపించారు. ఇదే కారణంగా ఆయన మొదటి భార్య వదిలి వెళ్లిపోయిందని అన్నారు.
"నవాజుద్దీన్‌తో బంధాన్ని కొనసాగించే ఉద్దేశం లేదు. వివాహ బంధంలో ఆత్మాభిమానం అనేది ఎంతో ముఖ్యం. కానీ నా విషయంలో దాన్ని దెబ్బతీశారు. నాకు ఎవరూ లేరనే ఫీలింగ్ ఏర్పడిపోయింది. ఒంటరిగా ఉన్న భావన కల్గింది. నవాజుద్దీన్ తమ్ముడు షమాస్ పెద్ద సమస్య. నేను మళ్లీ తిరిగి నా పాత జీవితాన్ని ప్రారంభించబోతున్నా. ఈ బంధాన్ని తెంచుకుని.. అంజనా కిశోర్ పాండేగా మారబోతున్నా. నా స్వలాభం కోసం మరొకరి పేరు వాడుకునే ఉద్దేశం నాకు లేదు. ఇప్పుడు భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచించాలి అనుకోవడం లేదు. కౌన్సిలింగ్ ఇచ్చినా ఇక లాభం లేదు. నా ఇద్దరు పిల్లల్ని నేనే చూసుకుంటా. గత 3-4 నెలల్లో పిల్లల్ని చూడటానికి నవాజుద్దీన్ ఒక్కసారి కూడా రాలేదు. వారి సంరక్షణను పట్టించుకోవడం లేదు".
-ఆలియా, నవాజుద్దీన్ రెండో భార్య
దీనిపై నవాజుద్దీన్ సోదరుడు షమాస్ స్పందిస్తూ.. న్యూస్ పేపర్ ద్వారా విడాకుల విషయం తెలుసుకున్నానని అన్నారు. చట్టపరంగా చర్యలు తీసుకుంటున్నప్పుడు తను కామెంట్ చేయాల్సిన అవసరం లేదని చెప్పారు.
ఇదీ చూడండి.. 'షూటింగ్ మళ్లీ ఎప్పడు ప్రారంభం అవుతుందో!'