ప్ర: కరోనా నేపథ్యంలో మీ జీవితంలో వచ్చిన మార్పు ఏంటి?
జ: ముందుగా నేను చెప్పదలచుకున్నది ఏంటంటే? ఏ టీవీ ఛానల్ ఆన్ చేసినా కరోనా గురించి చెప్పే వార్తలు చూసి ప్రజలు విసుగెత్తిపోయి ఉన్నారు. అందుకే మీతో మాట్లాడిన కాసేపు నవ్వించడమే ప్రధాన ఉద్దేశంగా పెట్టుకున్నాను. లాక్డౌన్ అన్నారు కాబట్టి మీకో విషయం చెబుతాను. నేను 1989లో నా కెరీర్ స్టార్ట్ చేసిన తర్వాత చాలా బిజీగా సినిమాలు చేస్తుండగా.. మొట్టమొదట నాకు 1995లో కెరీర్ డ్రాప్ అయింది. అప్పట్లో ఇంట్లోనే కూర్చున్నాను. పెళ్లి సందడి తర్వాత మళ్లీ పుంజుకొన్నాను. తర్వాత 2000-01లో ఆర్పీ పట్నాయక్, మణిశర్మ ప్రభంజనం నాపై పడి నేను మళ్లీ ఇంట్లోనే కూర్చున్నాను. అప్పట్లో కూడా నేను ఏడాది, ఏడాదిన్నర లాక్డౌన్లో ఉన్నట్టే. మళ్లీ 2008లో ఒక సంవత్సరం ఖాళీగానే ఉన్నాను. లాక్డౌన్ నాకైతే కొత్తగా అనిపించట్లేదు.
ప్ర:కరోనా తర్వాత ప్రజల జీవన విధానం ఎలా మారుతుంది.?
జ: రెక్కాడితో గానీ డొక్కాడని వాళ్లకు ఈ లాక్డౌన్ సమయంలో సమస్య ఉంటుంది. ఒక్కసారి లాక్డౌన్ తీసేస్తే సమస్య ఉండదు. ఆర్థిక మాంద్యం వస్తున్నందున మనం వందరూపాయలు ఖర్చుపెట్టే సమయంలో యాభై ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఎవరి స్థాయిని బట్టి వారి ఖర్చును అదుపు చేసుకుంటే మంచిది. మనం ఎంత సంపాదిస్తున్నామో అంతకే ఖర్చులు తగ్గించుకోవాలి. సంపద పెరిగినప్పుడు పెంచుకోవచ్చు. ఇలా చేస్తే ఇలాంటి లాక్డౌన్లు ఎన్ని వచ్చినా అది మనిషిని ఇబ్బంది పెట్టలేదు.
ప్ర:చిరుద్యోగులు భయంలో ఉన్నారు. వారికి మీరిచ్చే సలహా..?
జ: చిరుద్యోగులు విపత్తు వచ్చిందని ఆందోళన చెందకుండా వాళ్లకి వచ్చిన ఆదాయంలో కొంత పొదుపు చేసుకోవాలి. కొంతమందిలో ఇప్పటికిప్పుడు సాధ్యం కాకపోయినా భవిష్యత్తులో ఆదాయం, ఖర్చుల విషయంలో ప్రణాళికతో ముందుకెళ్లాలి. ఒక రకంగా చెప్పాలంటే ఈ లాక్డౌన్ అందరికీ ఓ గుణపాఠం లాంటిది. దీన్నుంచి మనం చాలా నేర్చుకోవాలి.
ప్ర:లాక్డౌన్ సమయంలో మీరు ఏం చేశారు..?
జ: ప్రస్తుతం వృత్తి పరమైన పనులన్నీ ఆగిపోయాయి. పుస్తకాలు చదువుకోవడం, సినిమాలు చూడడం,కుటుంబంతో గడపడం, ఇంటిపనులు చేసుకోవడం, చిన్న చిన్న ఆటలు ఆడడం. వీటితోనే కాలం గడిచిపోతుంది.
ప్ర: లాక్డౌన్ పరిస్థితుల్లో మహిళల పాత్ర తెలిసిందా..?
జ: అప్పట్లో మహిళలు కేవలం వంటింటికే పరిమితం అనే భావన ఉండేది. కానీ ప్రస్తుతం పరిస్థితి మారింది. అతివలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. అయితే ఏమీ ఆశించకుండా మహిళలు మన బాగు కోసమే ఆరాటపడతారు. మన నుంచి వాళ్లు కోరుకునేది ఒక్కటే.. అది గుర్తింపు. వాళ్ల కష్టాలు ఎప్పటికప్పుడు గుర్తించి కితాబు ఇవ్వడం. కితాబు అంటే వాళ్లకు నచ్చిన పని చేయడం, నచ్చిన బహుమతి ఇవ్వడం. అంతకు మించి ఏం కోరుకోరు. వాళ్లను గౌరవించి.. కృతజ్ఞత భావనతో మసులుకోవాలి.
ప్ర: లాక్డౌన్ సమయంలో ఎప్పుడైనా వంట చేశారా..?
జ: నాకు వంట రాదు(నవ్వుతూ). కేవలం కస్టర్డ్ పౌడర్‌తో చేసే స్వీట్, ఆమ్లెట్ వేయడం మాత్రమే వచ్చు. అది కూడా ఎప్పుడో రెండు నెలలకోసారి చేస్తాను.
ఇవీ చూడండి: కొవిడ్ కంట్రోల్ రూంను పరిశీలించిన కేంద్ర బృందం