కరోనా వైరస్ సినీ ప్రియులకు వెండితెర వినోదాన్ని దూరం చేసింది. ప్రత్యమ్నాయంగా వచ్చిన ఓటీటీ ప్లాట్‌ఫామ్ గత ఆరునెలలుగా ప్రేక్షకుల పాలిట థియేటర్‌గా మారింది. ఇప్పట్లో సినిమా హాళ్లు తెరుచుకునే అవకాశాలు లేకపోవడం వల్ల.. విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాలను డిజిటల్ వేదికల ద్వారా విడుదల చేస్తూ ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తున్నారు దర్శక నిర్మాతలు. జయాపజయాలతో సంబంధం లేకుండా సినిమా విడుదలైతే చాలు అనుకుంటూ ముందుకెళ్తున్నారు.
మరోవైపు బడ్జెట్ భారంగా మారుతుండటం వల్ల దర్శక నిర్మాతలు వీటికే ఓటు వేస్తూ సినిమాలను విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో కొత్త నటీనటుల దగ్గర నుంచి అగ్రశేణి తారల చిత్రాలూ ఓటీటీ బాటపడుతున్నాయి. ఇందులో భాగంగా ఇప్పటికే 25 సినిమాలు విడుదలయ్యాయి. ఒకటీ రెండు చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకోగా.. మిగిలిన సినిమాలన్నీ మిశ్రమ ఫలితాలనందుకున్నాయి.
ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్
లాక్డౌన్ సమయంలో ఓటీటీలో విడుదలైన తొలి చిత్రం 'అమృతరామమ్'. థియేటర్ల పునః ప్రారంభం ప్రశ్నార్థకంగా ఉన్నందు వల్ల మరిన్ని సినిమాలు ఇదే బాటలో నడిచాయి. సురేష్ ప్రొడక్షన్స్ నిర్మించిన 'కృష్ణ హిజ్ లీలా'తోపాటు కీర్తి సురేశ్ 'పెంగ్విన్', '47 డేస్', 'జోహార్', 'ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య', 'బుచ్చినాయుడు కండ్రిగ', 'వి', 'అమరం అఖిలం ప్రేమ' చిత్రాలను బుల్లితెరలోనే చూడాల్సి వచ్చింది. ఈ క్రమంలో సీని ప్రియుల్ని పెద్ద ఎత్తున ఓటీటీ వైపు మళ్లించడంలో పలు చిత్రాలు విజయం సాధించాయి.
వాటిలో భారీ అంచనాలతో విడుదలైన కీర్తి సురేశ్ 'పెంగ్విన్', నాని 'వి' సినిమాలు మిశ్రమ ఫలితాన్ని దక్కించున్నాయి. 'ఉమామహేశ్వర ఉగ్రరూపస్య', 'అమరం అఖిలం ప్రేమ' చిత్రాలకు మంచి ఆదరణ లభిచింది. తెలుగు సినిమాలతో పాటు 'ఫోరెన్సిక్', 'ట్రాన్స్', '36 వయస్సులో', 'మగువలు మాత్రమే', 'బంగారుతల్లి' వంటి అనువాద చిత్రాలు ఓటీటీలో సందడి చేశాయి. మరోవైపు సూర్య నటించిన 'అకాశమే నీ హద్దురా' కూడా ఇదే ప్లాట్ఫామ్లో విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.
ఓటీటీ వైపు భారీ బడ్జెట్ చిత్రాలు
ఒప్పందాల మేరకు ఓటీటీ బాటపడుతున్న చిత్రాల్లో వచ్చే నెలలో మరిన్ని బడ్జెట్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అందులో అగ్ర కథానాయిక అనుష్క నటించిన 'నిశ్శబ్దం' ఒకటి. సుమారు 30 కోట్ల రూపాయలతో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని నిర్మించింది. గత ఆరు నెలలుగా విడుదల కోసం ఎదురుచూస్తున్న ఈ సినిమా ఎట్టకేలకు ఓటీటీవైపే వెళ్లింది. అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా అమెజాన్ ప్రైమ్‌లో.. తెలుగుతోపాటు తమిళ, మలయాళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ ఏడాది ఉగాదికే విడుదల కావల్సిన రాజ్ తరుణ్ 'ఒరేయ్ బుజ్జిగా' కూడా కరోనా కష్టాల్లో చిక్కుకుపోయింది. థియేటర్ల పునఃప్రారంభంపై సందిగ్ధత నెలకొనడం వల్ల.. నిర్మాత రాధామోహన్ ఓటీటీవైపు మొగ్గుచూపారు. అక్టోబర్ 2న బుజ్జిగాడ్ని ఆహాలో విడుదల చేస్తున్నారు. ఇదే జోరుతో లఘు చిత్రాల నటుడు సుహాస్ తొలిసారి హీరోగా నటించిన 'కలర్ ఫొటో' కూడా డిజిటల్ బాట పట్టింది. అక్టోబర్ 23న సినిమా విడుదల కానుంది.
ఆ హీరోల సినిమాలు కూడా ఇక్కడే!
థియేటర్లు తెరుచుకొని ప్రేక్షకులు మళ్లీ వెండితెర వినోదాలకు అలవాటు పడితే ఓటీటీ వేదికలకు ఇప్పుడున్నంత ఆదరణ మళ్లీ దక్కకపోవచ్చు. అందువల్ల ఈ కొద్ది సమయంలోనే వీలైనంత త్వరగా తమ డిజిటల్ వేదికలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఆయా ఓటీటీ సంస్థలు పోటీపడుతున్నాయి. విడుదలకు సిద్ధంగా ఉన్న పెద్ద సినిమాలను తమ వలలో వేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఆ వరుసలో శర్వానంద్ 'శ్రీకారం', నితిన్ 'రంగ్ దే'తోపాటు వైష్ణవ్ తేజ్ 'ఉప్పెన', ప్రదీప్ '30 రోజుల్లో ప్రేమించడం ఎలా', సాయితేజ 'సోలో బ్రతుకే సో బెటర్' చిత్రాలున్నాయి.