Gen Z Tech Shaming : ప్రపంచానికి కంప్యూటర్లు పరిచయం అయిన కొత్తల్లో వాటి వినియోగం అప్పటి వ్యక్తులకు పెద్ద సవాలుగా ఉండేది. టెక్నాలజీలో వస్తున్న మార్పులను అందిపుచ్చుకోవడంలో వీరు చాలా రకాల ఇబ్బందులను ఎదుర్కొనేవారు. ఆ తర్వాత వచ్చిన తరం ఈ విషయంలో పెద్దగా సమస్యలు ఎదుర్కోలేదనే చెప్పాలి. అయితే 1995-2012 మధ్య పుట్టిన వారిని జనరేషన్ జెడ్‌గా (Generation Z) యువతగా వ్యవహరిస్తారు. ఈ జనరేషన్ జెడ్ తరంవారు లేటెస్ట్ టెక్నాలజీకి అలవాటు పడినవారే. పాత తరాలతో పోలిస్తే టెక్నాలజీ విషయంలో వీరు కాస్త ముందే ఉంటారు. కానీ ఆఫీసుల్లో పనిచేసేటప్పుడు మాత్రం వీరు సాంకేతిక విషయాల్లో పలు ఇబ్బందులకు గురువుతున్నారు. ఈ క్రమంలోనే 'టెక్ షేమ్' అనే పదం తెరపైకి వచ్చింది.
టెక్ షేమ్ అంటే ఏంటి?
What Is Tech Shame : జెనరేషన్ జెడ్ యువత ఉద్యోగ జీవితంలో టెక్నాలజీ వినియోగం సమయంలో ఎదుర్కొనే ఇబ్బందులనే టెక్ షేమింగ్‌గా పేర్కొంటున్నారు. వీరు ముఖ్యంగా ఆఫీసుల్లో పనిచేసేటప్పుడు ఈ సమస్యను ఎదుర్కొంటున్నట్లుగా లాసల్లే ఏజెన్సీ అనే సంస్థ తన సర్వేలో వెల్లడించింది. ముందుగా ఈ టెక్ షేమ్ అనే పదాన్ని కంప్యూటర్లు తయారుచేసే హెచ్‌పీ కంపెనీ వినియోగించింది. వృత్తి జీవితంలో ఉపయోగపడే పరికరాల వినియోగం విషయంలో ఎక్కువగా యువత ఇబ్బందికి గురవుతున్నారని నిర్వచించడానికి ఈ పదాన్ని ప్రయోగించింది. ప్రతి ఐదుగురిలో ఒకరు ఈ టెక్నాలజీ సంబంధిత సమస్యను ఎదుర్కొంటున్నట్లుగా హెచ్‌పీ తెలిపింది. వృత్తి జీవితంలో ఇలా టెక్నాలజీని వాడలేకపోవడాన్ని ఒక అసమర్థతగా జనరేషన్ జెడ్ వ్యక్తులు భావిస్తున్నారని లాసల్లే ఏజెన్సీ పేర్కొంది. పైగా ఏదైనా సందేహం వస్తే వీరు తోటి వారిని అడగడానికి మొహమాట పడతున్నారని.. ఒకవేళ అవతలి వారు ఏదైనా మాట అంటే దానిని అవమానంగా భావిస్తున్నారని పేర్కొంది. అందుకే దీనిని టెక్‌షేమ్‌గా పేర్కొంటున్నారని వెల్లడించింది.
ఆ విషయంలో వెనుకంజ..
Tech Shame At Work : జెనరేషన్ జెడ్ తరం యువత ఇప్పుడిప్పుడే ఉద్యోగ జీవితాన్ని ప్రారంభిస్తుంటారు. చిన్నతనం నుంచి లేటెస్ట్ మొబైల్ ఫోన్లు, ట్యాబ్‌లు, ల్యాప్‌టాప్‌లు లాంటి గ్యాడ్జెట్స్‌ను వినియోగించడంలో మిగతావారి కంటే వీరే ముందే ఉంటారు. కానీ, ప్రొఫెషనల్ లైఫ్‌లో మాత్రం వీరు చాలా వెనుకంజలో ఉన్నారని సర్వేల్లో బయటపడింది. వీరు పాత తరం కంప్యూటర్లు, ప్రింటర్లు, ఫ్యాక్స్ మెషీన్ల వినియోగం విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారట. వృత్తిపరమైన డిజిటల్ సాధనాలను సరైన రీతిలో వినియోగించలేకపోతున్నారట. ప్రధానంగా గతేడాది గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి వృత్తి జీవితంలోకి అడుగుపెట్టిన ఫ్రెషర్స్‌లో దాదాపు సగం మంది ఇలా టెక్నాలజీపరంగా ఇబ్బందిపడ్డారని లాసల్లే ఏజెన్సీ సర్వే స్పష్టం చేసింది.
నిపుణులు ఏమంటున్నారు..?
కొందరు ఈ టెక్ షేమింగ్ సమస్యను చిన్న విషయంగానే పరిగణించినా.. జెనరేషన్ జెడ్ యువత మాత్రం ఇది తమ ఆత్మగౌరవానికి భంగం కలిగించే అంశంగా భావిస్తున్నారని మానసిక నిపుణులు చెబుతున్నారు. ఈ టెక్ షేమింగ్ వల్ల వీరు ఒంటరిగా ఫీలయ్యే ప్రమాదం ఉందని కూడా వారు హెచ్చిరిస్తున్నారు. సాధారణంగా టెక్ షేమింగ్ ఇబ్బంది అన్ని వయస్సు వారికీ సంబంధించిందే అయినా.. జెనరేషన్ జెడ్ ఉద్యోగులపై మాత్రం దీని ప్రభావం అధికంగా ఉందని చెబుతున్నారు.
పరిష్కారం లేదా..?
టెక్ షేమింగ్ సమస్యను నివారించాలంటే కొత్తగా ఉద్యోగంలో చేరే వ్యక్తులపై మేనేజర్ స్థాయి వ్యక్తులు ప్రత్యేక దృష్టి పెట్టాలి. సర్వేలు, ఇంటర్వ్యూల ద్వారా టెక్ షేమింగ్ గురించి తెలుసుకుని జెనరేషన్ గ్యాప్‌ను పూడ్చేందుకు ప్రయత్నించాలని సూచిస్తున్నారు ఎక్స్పర్ట్స్.